కాళేశ్వరం లింక్ 2 భూ సేకరణలో అవకతవకలు

by Dishanational1 |
కాళేశ్వరం లింక్ 2 భూ సేకరణలో అవకతవకలు
X

దిశ, పెగడపల్లి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు అందించే నష్ట పరిహారం నిర్ధారణలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని నామపూర్ గ్రామంలో నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో మొదటి నుండి పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. పలు మార్లు రైతులతో కలిసి సమావేశాలు నిర్వహించి నష్ట పరిహారాన్ని నిర్ణయించారు. అయితే ఆ నష్ట పరిహారం చెల్లింపు విషయంలో అధికారుల తప్పిదం వల్ల గ్రామానికి చెందిన రైతు సంకటి లచ్చి రెడ్డి అనే రైతు తాను కోల్పోయిన భూమి కంటే తక్కువ భూమికి నష్ట పరిహారాన్ని మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు.

గ్రామానికి చెందిన సంకిటి లచ్చి రెడ్డి అనే రైతుకు సర్వే నెంబర్ 311/b/3 లో ఎకరం అయిదు గుంటల భూమి, మరియు సర్వే నంబర్ 315/c/11 లో ఎకరం గుంట భూమి ఉంది. కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ లో భాగంగా సర్వే నెంబర్ 311/b/3 లో ఇరవై గుంటల భూమిని, సర్వే నెంబర్ 315/c/2లో ఎకరం ఒక గుంట భూమి కోల్పోతున్నారు. అట్టి భూమికి రెవెన్యూ అధికారులు వచ్చి హద్దులు కూడా నిర్ణయించారు. అనంతరం నష్ట పరిహారం నిర్ణయించే విషయమై అధికారులు సర్వే కూడా నిర్వహించారు. సంబంధిత రైతు కోల్పోతున్న ఎకరం ఒక గుంటల భూమిలో ఒక బావి, రేకుల షెడ్డు ఉందని గెజిట్ నోట్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదే అధికారులు అట్టి భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేవు అని ఆ రైతుకు అవార్డ్ నోటీస్ పంపించారు. అంతే కాకుండా సర్వే నెంబర్ 311/b/3లో కోల్పోయిన ఇరవై గుంటల భూమికి బదులు అధికారులు కేవలం 14 గుంటల భూమి మాత్రమే పోతున్నట్టు తప్పు రికార్డ్ నమోదు చేశారు. ఇదే విషయమై అధికారులను కలిసి విన్నవించుకోగా మరోసారి అవార్డ్ నోటీస్ ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కొద్ది రోజుల అనంతరం కోల్పోయిన భూమికి చెల్లించే నష్ట పరిహారం కోసం అవార్డ్ నోటీస్ ఇచ్చారు. అయితే అధికారులు మరొకసారి పంపిన అవార్డ్ నోటీస్ లో రైతు కోల్పోయిన ఇరవై గుంటల భూమికి బదులు 14 గుంటల భూమి మాత్రమే కోల్పోతున్నట్టు అలాగే ఎలాంటి బావి, రేకుల షెడ్డు లేనట్లు అవార్డ్ నోటీస్ ఇచ్చారు. అంతే కాకుండా తనకి పక్కన ఉన్న భూమిలో ఎలాంటి పైప్ లైన్ వెళ్లకున్నా వారు ఎలాంటి భూమి కొల్పోకున్నా ఇద్దరు రైతులు తమ భూమిని కోల్పోయినట్లు అధికారులు తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారని వాస్తవంగా తాను కోల్పోతున్న 20 గుంటల భూమికి బదులు 14 గుంటల భూమి మరియు బావి ఉన్నా లేనట్లు, రేకుల షెడ్డు ఉన్నా లేనట్లు నమోదు చేసి అధికారులు తమ నిర్లక్ష్యం వల్ల తనకి రావాల్సిన నష్ట పరిహారాన్ని కోల్పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం: రైతు సంకిటి రవీందర్ రెడ్డి

మాకు సర్వే నెంబర్ 311/b/3 లో ఎకరం అయిదు గుంటల భూమిలో 20 గుంటల భూమిని కోల్పోతున్నాం.. 315/c/2లో ఎకరం ఒక గుంట భూమి కోల్పోతున్నాం.. ఎకరం ఒక గుంట భూమిలో రేకుల షెడ్డుతో పాటు మంచి నీటి బావి కూడా ఉండేది.. కానీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వల్ల రికార్డుల్లో సర్వే నెంబర్ 311/b/3 లో 14 గుంటల భూమి మాత్రమే పోతున్నట్టు, అదే విధంగా సర్వే నెంబర్ 315/c/2లో ఎలాంటి బావి, రేకుల షెడ్డు లేనట్లు అధికారులు చూపారు అని అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. వెంటనే మళ్ళీ సర్వే చేసి నేను నష్టపోయిన భూమికి రావాల్సిన నష్ట పరిహారం చెల్లించాలని.. లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక అవకాశం లేదని వాపోయాడు.



Next Story

Most Viewed