ఇంటింటికీ ఇంటర్నెట్, కేబుల్ టీవీ.. 20 MB స్పీడ్‌తో బ్రాడ్‌బాండ్ లైన్

by Gantepaka Srikanth |
ఇంటింటికీ ఇంటర్నెట్, కేబుల్ టీవీ.. 20 MB స్పీడ్‌తో బ్రాడ్‌బాండ్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటింటికీ ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ కనెక్షన్లు ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ మొదలైంది. ‘టీ-ఫైబర్‌’ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ప్రభుత్వం భావించింది. సర్కారు ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అందించేందుకు ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయనున్నది. టెండర్ ద్వారా ఖరారు చేసిన తర్వాత తొలి మూడు నెలల పాటు ఆ గ్రామాల్లో ఉచితంగానే అందజేయాలని భావిస్తున్నది. ప్రతి ఇంటికీ కనీసంగా 20 ఎంబీ (మెగా బైట్స్) స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ను ఓఎఫ్‌సీ (ఆప్టికల్ ఫైబర్ కేబుల్) ద్వారా అందించాలని అనుకుంటున్నది. దీనితో పాటే ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం, ‘ఫ్రీ టు ఎయిర్’ పేరుతో ఉచితంగా అందుతున్న టీవీ చానెళ్లతో పాటు కొన్ని ‘పెయిడ్’ చానెళ్లను కూడా ఇవ్వాలనుకుంటున్నది.

ఒకేసారి 15 మంది వాడేలా ఫెసిలిటీ

ఇండ్లతో పాటు అన్ని గవర్నమెంటు ఆఫీసులకు (గ్రామ పంచాయతీ, మండల కార్యాలయం) సైతం వీడియో కాన్ఫరెన్సు అవసరాల కోసం ఓఎఫ్‌సీ ద్వారానే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. కొన్నిసార్లు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌(ట్యాబ్)లను సైతం ప్రభుత్వ సిబ్బంది వాడాల్సి ఉన్నందున వాటికి కూడా అనువైన తీరులో నెట్‌వర్క్ సామర్థ్యం ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒకేసారి 15 మంది యూజర్లు వాడేలా ప్రభుత్వ ఆఫీసులకు ఈ ఫెసిలిటీని సమకూర్చేలా ఆలోచిస్తున్నది. ఇండ్లకు ఇచ్చే కనెక్షన్‌లో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఇంటర్‌నెట్, టీవీ చానెళ్లన్నీ కలిపి బేసిక్ ప్యాకేజీగా సర్కారు అందించాలనుకుంటున్నది. ఇదే సమయంలో ప్రభుత్వం టీ-శాట్ ద్వారా విద్యార్థులకు ఉచిత వీడియో తరగతులను కూడా అందిస్తున్నందున దాన్ని కూడా వాడుకునేలా జాగ్రత్తలు తీసుకోనున్నది.

ప్రతి జీపీకి కనీసంగా 5 కనెక్షన్లు

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఏకకాలంలో ఇండ్లకు, ప్రభుత్వ ఆఫీసులకు ఈ సేవలను అందించే ప్రాసెస్‌ను టీ-ఫైబర్ 3 నెలల పాటు అధ్యయనం చేయనున్నది. ప్రతి గ్రామ పంచాయతీకీ కనీసంగా ఐదు కనెక్షన్లను ఇస్తున్నందున కంప్యూటర్ల అనుసంధానానికి వాడే ‘లాన్’, సీసీటీవీల ఫుటేజీని దానికే కనెక్ట్ చేయడం లాంటివి కూడా ఏ తీరులో పనిచేస్తున్నాయో పరిశీలించనున్నది. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అవసరమైన మార్పులు చేర్పులను కూడా చేయాల్సిందిగా ప్రైవేటు కంపెనీకి సూచించనున్నది. రాష్ట్రంలోని మొత్తం మూడున్నర కోట్ల మందికి (పట్టణాల్లో 30 లక్షల ఇండ్లు, గ్రామాల్లో 63 లక్షల ఇండ్లు) ఈ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రాన్ని మొత్తం 10 జోన్లుగా విభజించి అన్ని ఇండ్లనూ కవర్ చేయాలనుకుంటున్నది. భవిష్యత్తులో కొత్త ఇండ్లకూ అందించేలా నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ప్రైవేటు కంపెనీ బాధ్యత.

కంపెనీ ఖరారయ్యాక ప్యాకేజ్ టారీఫ్ ఫైనల్

టీ-ఫైబర్ ఈ సర్వీసులను నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్ నుంచి అందించాల్సి ఉన్నందున మధ్యలో అవసరమైన మౌలిక సౌకర్యాలను ప్రైవేటు కంపెనీ సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇందుకు ఇప్పటికే పాక్షిక సేవలందిస్తున్న రీజినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు లేదా స్థానిక కేబుల్ ఆపరేటర్ల ఎక్విప్‌మెంట్‌ను వాడుకోవచ్చనే ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నది. అవసరమైతే సబ్ కాంట్రాక్టులపై మెయిన్ కంపెనీదే నిర్ణయం అని ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలనుకుంటున్నది. ప్రైవేటు కంపెనీని ఖరారు చేసిన తర్వాత ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకుని ప్యాకేజ్ టారిఫ్‌ను ఫైనల్ చేస్తుంది. గరిష్టంగా రూ.300 మించకుండా ఈ ప్యాకేజీని ఇండ్లకు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందుల్లేకుండా, 20 మెగా బైట్స్‌కు తగ్గకుండా నిర్దిష్టమైన స్పీడ్‌తో ఇంటర్‌నెట్ కనెక్టివిటీని నిరంతరాయంగా వాడుకునేలా ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం షరతు విధించనున్నది.

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే ఆలోచన

మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ సేవలను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీన్ని లాంఛనంగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో వీడియో తరగతులను లేదా వీడియో కాన్ఫరెన్సును నిర్వహించుకునేలా కనీసం ఒక్కో పాఠశాలకు ఐదు కనెక్షన్లను వాడుకునేలా ఓఎఫ్‌సీ ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పించాలన్నది కూడా ఒక షరతు. ఇండ్లకు ఈ సౌకర్యాన్ని కల్పించిన తర్వాత టెక్నికల్ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా ఆ కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది. టీ-ఫైబర్ ద్వారా ఈ మొత్తం సేవలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

పైలెట్ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియకు శ్రీకారం

ప్రతి గ్రామానికీ ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని అందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిని కలిసి టీ-ఫైబర్‌ను భారత్ నెట్ 4.0 స్కీమ్‌తో అనుసంధానం చేయాలని, కేంద్రం తగిన నిధులను ఇవ్వాలని కోరింది. దానికి సానుకూలంగా కేంద్రం స్పందించడంతో వీలైనంత తొందరగా గ్రామాలకు ఈ సేవలను అందించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టును అమలు చేయడానికి వీలుగా టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే టెండర్లను ఖరారు చేసి నిర్దిష్ట గడువు విధించుకునే అన్ని ఇండ్లకూ, ప్రభుత్వ ఆఫీసులకు టీ-ఫైబర్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వినియోగంతో ఇంటర్‌నెట్ సేవలు సాకారం చేయాలనుకుంటున్నది.

Advertisement

Next Story