'ఇంటర్ బోర్డు ప్రతిష్ట పెంచేలా నిర్ణయం తీసుకోండి'

by Disha Web Desk 2 |
ఇంటర్ బోర్డు ప్రతిష్ట పెంచేలా నిర్ణయం తీసుకోండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్‌గా నవీన్ మిట్టల్‌ను నియమించాక బోర్డు పనితీరును మరింత బాగుపడుతుందని అనుకున్నానని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ బోర్డులో మిట్టల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై ఆయన సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. బోర్డు పనితీరు మెరుగువుతుందనుకుంటే అందుకు విభిన్నంగా సీన్ మారిందన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న బయోమెట్రిక్ హాజరు యంత్రాలను మూలకు పడేసి ఏడాదికి రూ.60 లక్షలు వెచ్చించి అద్దె ప్రాతిపదికన బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఆయన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారనే చర్చ కొనసాగుతున్నదని ఆరోపించారు. విద్యామండలి సంక్షోభానికి కారణమైన గ్లోబరీనా సంస్థకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం అత్యంత అభ్యంతరకరమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లుగా వెల్లడించారు. గ్లోబరీనా సంస్థ, సీఓఈఎంపీటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లుగా ఉత్తర్వులు వచ్చాయని, అయితే బిడ్డింగ్ సమావేశానికి ఆ సంస్థ ప్రతినిధులు ఎందుకు హాజరయ్యారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టెండర్ల తయారీ సైతం గ్లోబరీనా కనుసన్నల్లో జరిగిందనేది ఇంటర్ బోర్డు వర్గాల్లో కొనసాగుతున్న చర్చ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంటర్ బోర్డును తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని గ్లోబరీనా సంస్థ తెరవెనుక ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి మౌనం దేనికి సంకేతమని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే స్పందించి పరీక్షల నిర్వాణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మండలి ప్రతిష్టను పెంచాలని విజ్ఞప్తిచేశారు.

Also Read..

కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

Next Story