వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల

by Disha Web Desk 2 |
వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓవైపు మండుతున్న ఎండలు, ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు పెద్దగా పడే అవకాశాలు తక్కువని ఇప్పటికే ప్రకటించిన భారత వాతావరణ శాఖ తాజాగా (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలో ఉండొచ్చంటూ తాజా అంచనాలను శుక్రవారం ప్రకటించింది. జూన్ 4వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఐఎండీ ట్వీట్ చేస్తూ.. ‘దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం అధిక శాతం సాధారణ స్థాయిలో ఉండొచ్చు. దీర్ఘకాల సగటు వర్షపాతం 96 నుంచి 104 శాతం మధ్య నమోదుకావచ్చు. నైరుతి రుతుపవనాలు బలంగా ఏర్పడిన తర్వాతే జూన్ 4 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. జూన్ 1వ తేదీ లోపు రుతుపవనాలు వస్తాయని ఆశించడం లేదు.

ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది’ అని ఐఎండీ పేర్కొంది. వచ్చే వారం వరకు అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశం లేదని తెలిపింది. భారత్‌లో ప్రాంతాల వారీ అంచనాలను గమనిస్తే.. దక్షిణ పీఠభూమి, మధ్య భారత్ లోని ప్రాంతాలు, ఈశాన్య భారత్‌లో వర్షపాతం దీర్ఘకాల సగటు ఆధారంగా చూస్తే సాధారణ స్థాయిలోనే నమోదు కావచ్చని అంచనా వేసింది. అదే వాయువ్య భారత్ లోని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటులో 92 శాతం కంటే తక్కువే నమోదయ్యే అవకాశాలున్నట్లు వెల్లడించింది. వర్షపాతం విస్తరణ అంతటా సమానంగా ఉంటే వ్యవసాయంపై పెద్దగా ప్రభావం పడదు. వాయువ్య భారత్ లో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువే వర్షపాతం నెలకొందని ఐఎండీ పేర్కొంది.


Next Story

Most Viewed