ఆడపిల్లా.. అబార్షనే.. గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు

by Dishanational2 |
ఆడపిల్లా.. అబార్షనే.. గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఆడ పిల్ల అని తెలిస్తే పురిట్లోనే ప్రాణాలు తీసేస్తున్నారు. భూమిమీదికి రాకముందే ఉసురు తీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేయిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్నది. కాసులకక్కుర్తికి అలవాటు పడ్డ కొందరు వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కఠిన చట్టాలున్నా అధికారుల అలసత్వంతో అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయి.

పట్టణాల కంటే పల్లెలే నయం..

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ప్రతీ వెయ్యిమంది మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువుల సంఖ్య 988గా ఉంది. అయితే పట్టణప్రాంతాల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉన్నది. ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు ఆడ శిశువులు 970 మంది మాత్రమే ఉన్నారు. అదే పల్లెల్లో ఈ సంఖ్య 999గా ఉన్నది. నగర జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తుండటం తదితర కారణాల వల్ల నగరాల్లో చాలామంది ఒకే ఒక్క సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మగబిడ్డను కోరుకుంటున్నారు. గర్భం దాల్చిన తరువాత పుట్టేది ఆడబిడ్డనా? మగబిడ్డనా? అన్నది స్కానింగ్చేయించుకుంటున్నారు. ఆడ శిశువు అని తేలితే గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు ఆడ పిల్లలను భారంగా భావిస్తూ పురిట్లోనే ఉసురు తీస్తున్నారు.

పటిష్ట చట్టాలున్నా..

అబార్షన్లను నియంత్రించేందుకు పటిష్ట చట్టాలున్నా అవి కాగితాలకే పరిమితమైపోయాయనే విమర్శలున్నాయి. గర్భధారణ తల్లి ప్రాణానికి ప్రమాదమని నిర్ధారణ అయితే, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తేలితే అబార్షన్ చేయించుకోవచ్చు. బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేకున్నా అబార్షన్ చేసుకునే వీలుంది. అయితే లింగ నిర్ధారణ అనేది నేరం. కానీ కొందరు వైద్యులు కాసులకక్కుర్తికి ఇష్టానుసారంగా అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్న ఖమ్మం, వరంగల్ లోని ఆస్పత్రులను గతేడాది సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం.

తల్లి ప్రాణాలకూ ప్రమాదమే..

అబార్షన్ చేస్తుండగా.. వికటించి తల్లి ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతున్నది. ఇందుకు వనస్థలిపురంలో జరిగిన ఘటనే నిదర్శనం. ప్రేమించి గర్భం దాల్చిన యువతిని అబార్షన్ చేయించేందుకు ప్రియుడు వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి గర్భస్రావ మాత్రలు ఇవ్వగా, అవి వికటించి యువతి మృతి చెందింది. అంతేకాకుండా కొందరు ఆర్ ఎంపీలు, నాటు వైద్యులు ఇష్టానుసారంగా గర్భస్రావాలుచేస్తుండడంతో ఎన్నో విషాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలున్నాయి.


Next Story

Most Viewed