విజిలెన్స్ తనిఖీలు పెంచండి.. విద్యుత్ నష్టాలు తగ్గించండి : ఎస్పీడీసీఎల్ సీఎండీ

by Disha Web Desk 13 |
విజిలెన్స్ తనిఖీలు పెంచండి.. విద్యుత్ నష్టాలు తగ్గించండి : ఎస్పీడీసీఎల్ సీఎండీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు విజిలెన్స్ తనిఖీలు పెంచాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ అధికారులకు ఆదేశించారు. డిస్కం సాంకేతిక, వ్యాపార నష్టాలను మరింతగా తగ్గించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు ముమ్మరం చేసి నష్టాలను తగ్గించాలని దిశానిర్దేశం చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టాలపై రఘుమారెడ్డి ఇంజినీర్లతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా డిస్కంల పరిధిలో సంభవించిన బ్రేక్ డౌన్ సంబంధిత పనులు పూర్తిచేసి, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న లైన్లను సైతం వెంటనే పునరుద్ధరించాలన్నారు. అదే విధంగా ఉగాది, రంజాన్ ఉపవాసాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి విద్యుత్ కు అంతరాయం కలగకుండా సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా డిస్కం రెవెన్యూ, బకాయిల వసూళ్లు, నష్టాల గురించి కూడా సమీక్ష జరిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,448 కోట్ల నెలవారీ డిమాండ్‌కు గాను 99 శాతం వసూళ్లు జరిగినట్లు, అందులోనూ సౌత్ సర్కిల్‌లో రూ.119 కోట్ల రెవెన్యూ డిమాండ్‌కు గాను రూ.118 కోట్లు వసూలైనట్లు అధికారులు ఆయనకు వివరించారు.


Next Story

Most Viewed