వానొస్తే.. జాగారమే!

by Dishafeatures2 |
వానొస్తే.. జాగారమే!
X

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్, అంతారం, వెంకటాపూ ర్, జంగారెడ్డిపల్లి గ్రామాలలో చిన్న చినుకు పడితే ఆరోజు రాత్రి మొత్తం కరెంటు లేకుండా ఇరు గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వర్షం వస్తే చిమ్మ చీకట్లోనే కాలం గడిపే పరిస్థితి నెలకొంది. ఇది పాలకులకు, అధికారులకు తెలియదా అంటే అన్నీ తెలిసిన కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే చాలా మంది రైతులు వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటున్నారు. కానీ చుక్కా పూర్, అంతారం, వెంకటాపూర్, జంగారెడ్డి పల్లి గ్రామస్తులు మాత్రం వర్షం వస్తే ఈరోజు రాత్రి మొత్తం మా ఊర్లలో కరెంటు ఉండదని గుబులు వాళ్లలో నెలకొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కిరోసిన్ సైతం బంద్ చేశారు.

కనీసం కరెంటు లేనప్పుడు అయినా ఇంట్లో దీపం వెలిగించుకోవడం ఇబ్బందిగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభమైందంటే చాలు దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుండి వ్యవసాయ పొలం పనులు చేసుకుని అలిసిపోయి ఇంటికి వస్తే రాత్రి వేళల్లో కరెంటు లేకపోవడంతో దోమలు బెడద నుండి తట్టుకోలేక రాత్రి మొత్తం కంటి నిండా నిద్ర లేకుండా జాగారం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు రైతన్నలు మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగలు పక్కన పెడితే ఇండ్లలోకి పాములు, తేలు వచ్చి కరిచిన దిక్కు లేదని వాపోతున్నారు.

సబ్ స్టేషన్ ఉన్నా ఫలితం శూన్యం

చుక్కాపూర్ గ్రామ సమీపంలో 2004లో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు కావడంతో ఇప్పటి నుండి మాకు కరెంటు నియంతరాయంగా ఎల్లవేళలా ఉంటుందని స్థానిక నేతలు, ప్రజలు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు 20 ఏళ్లు గడుస్తున్నా కరెంటు బ్రేక్ డౌన్ సమస్యల వల్ల నిత్యం అంతరాయం కలుగుతూ సాయంత్రం కాగానే చిన్నపాటి వర్షం చినుకులు వస్తే చాలు తెల్లవార్లు కరెంటు లేకుండా ఉండడం ఇది ఎవరు నిర్లక్ష్యమని ప్రజలు ట్రాన్స్కో అధికారులపై అగ్గిలంలో గుగ్గిలం అవుతున్నారు.

జంగారెడ్డిపల్లిలో ఇదే పరిస్థితి

ఎన్నో సంవత్సరాలుగా తలకొండపల్లి విద్యుత్ సబ్స్టేషన్ నుండి జంగారెడ్డి పల్లి గ్రామానికి కరెంటు సరఫరా కొనసాగుతుండేది. కానీ గత 14 ఏళ్ల క్రితం 2009 ఫిబ్రవరి 20న గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడంతో తలకొండపల్లి సబ్ స్టేషన్ లో ఓవర్ లోడు ఎక్కువగా ఉందని జంగారెడ్డి పల్లి తో పాటు, మరికొన్ని గ్రామాలను కూడా గట్టు ఇప్పలపల్లి సబ్ స్టేషన్ కు అప్పట్లో మార్చారు. కానీ ప్రతినిత్యం గ్రామానికి సరఫరా అయ్యే కరెంటులో మాత్రం వర్షం లేనప్పుడు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకున్నా, వర్షం వస్తే మాత్రం పదేళ్లుగా తెల్లవార్లు కరెంటు లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్జాల్ 33/11 కేవీ ఉపకేంద్రం వెల్జాల్ ఉప కేంద్రం నుండి అంతారం, వెంకటాపూర్, చెన్నంపల్లి గ్రామాలకు సరఫరా జరిగే లైన్లో కాలం చెల్లిన కరెంటు వైర్లు ఉండడంతో ప్రతినిత్యం ఆ గ్రామాలకు కరెంటు సరఫరా లో అవాంతరాలు ఎదురవుతున్నాయి.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

జంగారెడ్డిపల్లి గ్రామంతో పాటు చుక్కాపూర్, అంతారం, వెంకటాపూర్, జూలపల్లి గ్రామాలలో కరెంటు సమస్య పరిష్కారం కోసం 2021 జూలై 16వ తేదీన గత రెండు సంవత్సరాల క్రితమే సిఎండి రఘుమారెడ్డి దృష్టికి తీసుకెళ్లి కొత్త లైన్ల ఏర్పాటు కోసం ఎస్టిమేట్ కూడా వేయించామని ఎంపీపీ నిర్మల పేర్కొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈనాడు ప్రతినిధి భూపాల్ కూడా తనకు సన్నిహితంగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి మా గ్రామ కరెంటు సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.

వినతులు పట్టించుకోవట్లే.. దాసరి యాదయ్య మాజీ ఎంపీటీసీ

మా గ్రామంలో గత 20 ఏళ్లుగా రాత్రి వేళలో వర్షం కురిస్తే తెల్లవార్లు కరెంటు లేకుండా చీకట్లోనే ఉండవలసిన పరిస్థితి నెలకొంది. నేను 2006 లో ఎంపిటిసి గా గెలిచాను. ప్రస్తుతం మా అమ్మ దాసరి కిష్టమ్మ కూడా సర్పంచ్ గా కొనసాగుతుంది. మరో ఐదు నెలల్లో మా పదవీకాలం కూడా ముగిసిపోతుంది. అయిన మా గ్రామ కరెంటు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.మా గ్రామానికి సబ్స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రత్యేక లైను ఏర్పాటు చేస్తే 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా ఉంటుందని ఉన్నత అధికారులు , స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొంటున్నారు.

కాలం చెల్లిన వైర్లతో అంతరాయం.. పయ్యావుల రమేష్ యాదవ్, సర్పంచ్ వెంకటాపూర్

వెల్జాల్ ఉపకేంద్రం నుండి మా గ్రామాలకు సరఫరా జరిగే కరెంటు వ్యవసాయ పొలాల మీదుగా 20 నుండి 30 కిలోమీటర్ల దూరం నుండి రావడం వల్లే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంకటాపూర్ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ ఆరోపిస్తున్నాడు. చిన్న చినుకు పడితే చాలు మా గ్రామాలకు గత 20 ఏళ్లుగా కరెంటులో అంతరాయం జరుగుతున్న ఈ నేత కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంతోమంది ఎమ్మెల్యేలు మారుతున్న మా గ్రామాల కరెంటు సమస్య మాత్రం నెరవేయడం లేదని సూచిస్తున్నారు.

Next Story