సర్కారుకు సంకటంగా హామీల అమలు.. ఎన్నికల ఏడాదిలో నిధులెట్లా?

by Disha Web Desk 2 |
సర్కారుకు సంకటంగా హామీల అమలు.. ఎన్నికల ఏడాదిలో నిధులెట్లా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఎలక్షన్స్‌లో ఎఫెక్ట్ పడుతుందని అధికార పార్టీ ఆందోళన చెందుతున్నది. నేటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, ఏడాది బడ్జెట్‌ను ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఖర్చు చేయాలని సర్కారు ప్లాన్ చేస్తున్నది. అయితే నిధుల సమీకరణ సవాల్‌గా మారింది. ఇష్టానుసారంగా అప్పులు చేసే వీలు లేక, ఆశించిన మేర ఆదాయం వస్తుందో తెలియక తికమక పడుతున్నట్లు తెలుస్తున్నది. అందుకే నెల వారీగా ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.

ఏడాది బడ్జెట్ ఐదారు నెలల్లో ఖర్చు

ఎన్నికలకు వెళ్లేముందు ఓట్లు రాల్చే పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. లేకుంటే రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నది. అందుకోసమే ఏడాదికి కేటాయించిన బడ్జెట్ ను ఐదారునెలల్లోనే ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. కీలకమైన దళిత బంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ, రైతుబంధు పథకాలకు పూర్తిస్థాయిలో అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నది.

దళితబంధుకు రూ.13 వేల కోట్లు

ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దళితబంధు స్కీమ్ కింద ఒక్కో నియోజకవర్గానికి 1100 లబ్ధిదారులకు, రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల మందికి ఆర్థికసాయం చేయాలని సర్కారు నిర్ణయించింది. షెడ్యూలు వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ స్కీమ్ అమలు కోసం సుమారు రూ. 13 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది.

గృహలక్ష్మికి రూ. 12 వేల కోట్లు

సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ. 3 లక్షల సాయం చేయాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో నియోజవర్గానికి 3 వేల ఇండ్లు సాంక్షన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 12 వేల కోట్లు నిధులు అవసరమవుతాయి. అయితే గృహలక్ష్మి స్కీమ్ అమలును దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంచలేదు.

గొర్ల పంపిణీకి రూ.4,500 కోట్లు

2018 ఎన్నికలకు ముందు మొదటి విడత గొర్ల పంపిణీ చేసిన ప్రభుత్వం, ఆతర్వాత నిధుల కొరత కారణంగా రెండో విడత అమలు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7.31 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన వాటాను ఫెడరేషన్ కు చెల్లించి గొర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈస్కీమ్ ను ఏప్రిల్ లో ప్రారంభించి అగస్టు నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం క్యాలండర్ తయారు చేసుకున్నది. ఇందుకోసం కావాల్సిన నిధులను అప్పుల ద్వారా సేకరించేందుకు కసరత్తు చేస్తున్నది.

రైతుబంధుకు రూ. 7,500 కోట్లు

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రైతుబంధు స్కీమ్ నే పెద్ద ఎత్తున ఓట్లు రాల్చిందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు వానాకాలం సీజన్ రైతుబంధు కోసం నిధులు సేకరించుకోవాలి. ఈ పక్రియను జూన్ మొదటి వారం నుంచి ప్రారంభించి ఆగస్టు మొదటివారం వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రూ. 7.500 కోట్ల నిధులు సిద్ధం చేయాల్సిన అవరసం ఉన్నది.

అప్పులే ఆధారం

కీలకమైన పథకాలను కొనసాగించేందుకు అప్పులు చేయకతప్పదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉన్నది. స్టేట్ ఓన్ రెవెన్యూ కింద వచ్చే ఆదాయం ప్రతినెల జీతాలు, ఇంతకాలం చేసిన అప్పులకు కిస్తీలు చెల్లించేందుకు సరిపోతుందని అంటున్నారు. అందుకని కీలకమైన స్కీమ్ లను పూర్తి చేసేందుకు అప్పులు చేయకతప్పదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. 2023–24 ఆర్థిక సంవత్సరం లో సుమారు రూ. 40 వేల కోట్ల అప్పులు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ అప్పులను ఆరు నెలల్లోనే తీసుకునే వెసులు బాటు కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

చివరి రోజు బిల్లుల కోసం ఒత్తిళ్లు

ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలిసింది. ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ లోపు బిల్లులు రాకుంటే ఆ తర్వాత బిల్లుల చెల్లింపు మరింత ఆలస్యం అవుతుందనే కారణంతో పెద్ద ఎత్తున పైరవీలు చేసినట్టు టాక్ ఉంది. 2022–23 అర్థిక సంవత్సరం లో పూర్తిచేసిన పనుల కోసం కాంట్రాక్టర్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, పెండింగ్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి: శ్రీరామనవమి స్పీచ్‌ ఎఫెక్ట్: MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

Next Story

Most Viewed