సుప్రీం కోర్టు స్టాండిగ్ కౌన్సిల్‌ శ్రవణ్‌ను సన్మానించిన ఐజేయూ

by Ramesh N |
సుప్రీం కోర్టు స్టాండిగ్ కౌన్సిల్‌ శ్రవణ్‌ను సన్మానించిన ఐజేయూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులైన ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్‌ని "ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేయూ)" శనివారం ఘనంగా సన్మానించింది. దశాబ్ద కాలం క్రితం పాత్రికేయ వృత్తి నుంచి న్యాయవాద వృత్తిలోకి వెళ్లి అనతికాలంలోనే సుప్రీంకోర్టులో "అడ్వొకేట్ ఆన్ రికార్డ్"గా ఎదిగి, ఇప్పుడు "స్టాండింగ్ కౌన్సిల్"గా బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్‌కి ఐజేయూ నేతలు, సభ్యులు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు.

ఐజేయూ అధ్యక్షుడు మహాత్మ కొడియార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎండీ మదార్, కోశాధికారి ఎంవీ శివరావు, జాయింట్ సెక్రటరీలు సంజయ్ శర్మ, పవన్ కుమార్‌తో పాటు సీనియర్ పాత్రికేయులు తేలప్రోలు శ్రీనివాసరావు, స్వరూప పొట్లపల్లి, అసోసియేషన్ ఇతర సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాత్రికేయులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు, సుప్రీంకోర్టు న్యాయవాదులు అల్లంకి రమేష్, పుప్పాల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని శ్రవణ్ కుమార్‌ని శాలువాలు, బహుమతులతో సత్కరించారు.

నిబద్ధతతో పని చేయాలి

ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఏ వృత్తిలో ఉన్న వారైనా సరే స్వలాభం చూసుకోకుండా నిబద్ధతతో పని చేయాలని, కొంత ఆలస్యమైనా తగిన ఫలితం దక్కుతుందన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించి బాధ్యతను మరింత నిబద్ధత, బాధ్యతతో నిర్వర్తిస్తానని, అందరికీ ఆదర్శంగా నిలవడానికి ప్రయత్నిస్తానన్నారు. సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో తాను వాదించిన కేసుల కారణంగా కొందరికి ఇబ్బంది కలిగినా సరే.. న్యాయం వైపు నిలిచానన్న సంతృప్తి తనకు ఉందన్నారు.

Next Story

Most Viewed