రుణమాఫీ చేయకపోతే మళ్లీ మీ ముందుకురాము : మంత్రి కోమటిరెడ్డి

by Disha Web Desk |
రుణమాఫీ చేయకపోతే మళ్లీ మీ ముందుకురాము : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ బ్యూరో : ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే భవిష్యత్తులో మీ ముందుకు రామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో నల్లగొండ అసెంబ్లీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తే పదేళ్ల కేసీఆర్ పాలనలో మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుర్చీ వేసుకుని మరి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానన్న కేసీఆర్‌కు కుర్చీ దొరకలేదేమో అని ఎద్దేవా చేశారు. వచ్చే మూడేళ్లలో ఎట్టి పరిస్థితులను ఎస్ఎల్బీసీని పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని అన్నారు.

రామన్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైందన్నారు. ఇప్పటికే గెలుపు ఖాయం అయినప్పటికీ 80 వేల మెజార్టీ కోసమే మనమంతా సీరియస్‌గా పని చేయాలన్నారు. ఇప్పుడు 12 రోజులు క్షేత్రస్థాయిలో మీరంతా కష్టపడితే రానున్న నాలుగున్నరేళ్లు మీ అందరి బాధ్యత నాదేనన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కళ్ళలో పెట్టి చూసుకుంటానని అన్నారు. గ్రామాలలో కష్టపడి పనిచేసిన నాయకులు భవిష్యత్తులో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఉంటారని అన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ ప్రచార బాధ్యత, దానికి సంబంధించిన ఆర్థికమైనపరమైన ఖర్చులు కూడా తానే భరిస్తానని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి నల్గొండ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కానుకగా పంపించాలన్నారు.

మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రతిపక్ష పార్టీలను కనీసం అసెంబ్లీలో మాట్లాడనివ్వని నియంత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యతకు ప్రతికగా ఉంటారని అన్నారు. సాయుధ పోరాటం ద్వారా దేశాన్ని ప్రభావితం చేసింది నల్లగొండేనన్నారు. మే 13న బ్యాలెట్ బాక్స్‌లో ఓట్ల రూపంలో పడే వరదే కార్యకర్తల చైతన్యానికి సంకేతం అని పేర్కొంటూ, ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సాధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ప్రత్యేకతను చాటాలని సూచించారు.

ఎంపీ అభ్యర్థి కొందరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తనకు మార్గదర్శకులైన జానారెడ్డితో పాటు చాలామంది సీనియర్ నేతలను చూసి పెరిగానని, అందరి ఆలోచనలు తీసుకొని అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. యువకుడిగా తనకు పని చేయాలనే తపన ఉందని ఆ తపన నెరవేర్చుకోవడానికి మీరంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ఎంతోమంది ఉద్దండలు ఈ నియోజకవర్గంలో నుంచి ఎంపికై పార్లమెంటులో తమ ప్రభావాన్ని చూపించారని, అదే దారిలో తాను పనిచేస్తానన్నారు. నల్లగొండ నియోజక వర్గానికి అందుబాటులో ఉండే విషయంలో మంత్రి కోమటిరెడ్డి తో పోటీపడి పనిచేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ ఇన్చార్జి నిరంజన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ , మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి , వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Next Story