రేవంత్ రెడ్డి బాటలో షర్మిల..ధరణిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 16 |
రేవంత్ రెడ్డి బాటలో షర్మిల..ధరణిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని, ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అని షర్మిల వ్యాఖ్యానించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే అని ఎద్దేవా చేశారు. తహశీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా ధరణి బాధలేనన్నారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ, ధరణే ధైర్యం అని చెప్పడానికి దొరకు, ఆయన బందిపోట్లకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదాల కోసం కాదని.. ముమ్మాటికి దొర భూ దోపిడీ కోసమే తెచ్చుకున్న పథకమని ఆరోపించారు. బందిపోట్ల ఆస్తుల్ని పెంచడానికి అమలు చేసిన పథకం అని అన్నారు. ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గమని చెప్పారు . ఈ ఎన్నికల్లో కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Next Story