GHMC లో ఆగని దుబారా! ఇష్టారాజ్యంగా ఛాంబర్ల ఆధునీకరణ

by sudharani |
GHMC లో ఆగని దుబారా! ఇష్టారాజ్యంగా ఛాంబర్ల ఆధునీకరణ
X

దిశ, సిటీబ్యూరో : మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అన్నట్టు తయారైంది జీహెచ్ఎంసీ పరిస్థితి. ఒకవైపు పీకలదాక అప్పుల్లో కూరుకుపొయిన జీహెచ్ఎంసీని ఆర్థికంగా గట్టెక్కించాల్సిన అధికారులు అక్రమార్జన కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇష్టారాజ్యంగా రెనొవేషన్ పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఒకవైపు ఖాజానా ఖాళీ కావటంతో రోజువారీ మెయింటనెన్స్ కూడా గగనంగా మారింది. నెలసరి జీతాల కోసం నిధులను సమీకరించేందుకు అధికారులు తలలు పట్టుకుంటుంటే మరికొందరు అధికారులు తమ అక్రమార్జన కోసం దుబారా పనులకు తెరదీస్తున్నారు.

ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, రిటైర్డు అయిన వారికి పెన్షన్లతో పాటు మెడికల్ రియంబర్స్ మెంట్లు, కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించేందుకు వీలుగా నిధుల సమీకరణకు కృషి చేయాల్సిన అధికారులు ఖజానాలో జమ అవుతున్న కొద్దీ నిధులను ఎలా మళ్లించేందుకు రెనొవేషన్ స్కెచ్‌లు వేసినట్లు ఆరోపణలున్నాయి. మెయింటనెన్స్ కాంట్రాక్టర్ల బిల్లులు ఏకంగా రూ.800 కోట్లకు పేరుకుపోవటంతో గత నెల ఇరవై రోజుల పాటు వారు సమ్మెబాట పట్టిన విషయం తెల్సిందే. కొత్త పాలక మండలి ఎన్నికైన రెండేళ్ల క్రితం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు చెప్పిన విధంగా, వారికి నచ్చిన విధంగా చాంబర్లను ఏర్పాటు చేసేందుకు కోట్లాది రూపాయలను దుబారాగా ఖర్చు చేశారన్న ఆరోపణలున్నాయి. డిప్యూటేషన్ పై ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీలో తిష్టవేసి కొందరు అధికారులు తమ అక్రమార్జన కోసం ఏ కొత్త అధికారి జీహెచ్ఎంసీలోకి వచ్చిన, ఆయనకు కేటాయించిన చాంబర్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదద్దుతున్నారు.

జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వచ్చి విధులు నిర్వర్తిస్తూ, ఇక్కడే రిటైర్డుమెంట్ అయిన తర్వాత మళ్లీ ఏడాది పాటు కొనసాగేలా ఎక్స్ టెన్షన్ ఆర్డర్లు తెచ్చుకున్న వారి కోసం కూడా లక్షలాది రూపాయలతో చాంబర్లను రెనొవేషన్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏడాది పొడువున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎక్కడో ఓ చోట రెనొవేషన్ పేరిట పైసలు ఖర్చయ్యే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లను చెల్లించేందుకు నిధుల్లేవని సమాధానం చెప్పే అధికారులు జీహెచ్ఎంసీ నిధులను ఇలా వృథాగా ఖర్చు చేసే పనులకెలా మంజూరీ ఇస్తున్నారని కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీలో చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించి, మళ్లీ జీహెచ్ఎంసీలోకి హౌజింగ్ ఓఎస్‌డీగా వచ్చిన ఓ ఇంజినీర్ చాంబర్‌ను కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించే పనులు చేపట్టడం చర్చనీయాంశమైంది. పైగా ఏ చిన్నపనైనా టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులను అప్పగించాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోకుండా ఎక్కువ కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులను కట్టబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

పదిహేనేళ్లుగా తిష్ట

జీహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటనెన్స్‌లో 15 ఏళ్ల నుంచి తిష్టవేసిన ఓ ఇంజినీర్ కనుసన్నలోనే ఎప్పటికపుడు బల్దియా ఖజానా ఖాళీ చేసేలా ఈ పనులు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటనెన్స్‌తో పాటు ఆబిడ్స్ సర్కిల్‌లోని మెయింటనెన్స్ పనులు కూడా చూసుకునే బాధ్యతలను అప్పగించారు. కొంతకాలం క్రితం ఓ రోడ్డు నిర్మాణంలో అలైన్‌మెంట్, క్వాలిటీ సక్రమంగా లేదన్న విషయాన్ని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గమనించి ఈ ఇంజినీర్ పై సస్పెషన్ వేటు వేశారు. అయినా నెలరోజుల్లోనే మళ్లీ పైరవీ చేసుకుని ఈ ఇంజినీర్ మళ్లీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి, అదీ మెయింటనెన్స్ విభాగం ఇంజినీర్‌గా వచ్చారంటే ఆయన రాజకీయ పరపతి ఏపాటీదో అంచనా వేయవచ్చు. కిందిస్థాయి సిబ్బందిని కూడా అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలోకి వచ్చినప్పటి నుంచి సదరు ఇంజినీర్ నగరశివారులో విల్లాలు, కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలున్నాయి.

Next Story