వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి.. కలుషిత రక్తమెక్కించడమే కారణం..

by Javid Pasha |   ( Updated:2022-08-25 13:25:36.0  )
వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి.. కలుషిత రక్తమెక్కించడమే కారణం..
X

దిశ, ఎల్బీనగర్: హస్తినాపురం వెల్నెస్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. కలుషిత రక్తం ఎక్కించడంతో ఓ మహిళ మరణించింది. స్వల్ప జ్వరంతో నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో చేరిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శీనయ్య, లక్ష్మమ్మ (40) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. శీనయ్య లారీ డ్రైవర్. కాగా పిల్లల చదువు కోసం నగరానికి వలస వచ్చి హస్తినాపురంలోని చంద్రప్రస్తా కాలనీలో నివాసం ఉంటున్నారు. గత ఐదు రోజులుగా లక్ష్మమ్మకు జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 20వ తేదీన హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్‌కి వచ్చింది.

ఆమెను పరీక్షించిన డాక్టర్లు ప్లేట్ లెస్ తక్కువగా ఉన్నాయని రక్తం ఎక్కించాలని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. రెండుసార్లు లక్ష్మమ్మకు రక్తం ఎక్కించారు. మూడోసారి కలుషిత రక్తం ఎక్కించడంతో వైద్యం వికటించి లక్ష్మమ్మ మృతి చెందింది. అయితే ఠాగూర్ సినిమాను తలపించే రీతిలో ఐసీయూలో ఆమెకు వైద్యం చేస్తున్నట్టు హాస్పిటల్ యాజమాన్యం బిల్డప్ ఇచ్చింది. చనిపోయిన 24 గంటల తర్వాత లక్ష్మమ్మ మృతి చెందినట్లు హాస్పిటల్ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నీతో ఆగ్రహించిన లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు వెల్నెస్ హాస్పిటల్ వద్దకు చేరుకుని వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మమ్మ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు.

సాగర్ హైవే దిగ్బంధం

మధ్యాహ్నం నుండి దాదాపు మూడు గంటల సేపు లక్ష్మమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేసినా హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెల్నెస్ హాస్పిటల్ ను సీజ్ చేయాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ సాగర్ హైవేను దిగ్బంధించారు. దాదాపు అరగంట సేపు సాగర హైవేపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారు.

Next Story

Most Viewed