చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు జలదిగ్బంధం

by Taduka Kalyani |

నగరంలో కురుస్తున్న స్వల్ప వర్షాలకే చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ప్రాంతం జలదిగ్బంధంగా మారుతోంది.

చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు జలదిగ్బంధం
X

దిశ, చంపాపేట్ జూన్ 9: నగరంలో కురుస్తున్న స్వల్ప వర్షాలకే చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ప్రాంతం జలదిగ్బంధంగా మారుతోంది. కేవలం 15 నుంచి 30 నిమిషాల పాటు కురిసే వర్షానికే రహదారులు నీటితో నిండిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు సిబ్బంది సైతం నీటి ముంపు కారణంగా రాకపోకల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతం అవుతున్నప్పటికీ సంబంధిత శాఖలు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, మురుగునీటి కాలువలు పూడుకుపోవడం వల్లే వర్షపు నీరు రహదారులపై నిలిచిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయం ముందే నీటి ముంపు నెలకొనడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనాలు, సిబ్బంది వేగంగా స్పందించాల్సిన సమయంలో నీటి ముంపు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొన్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ, సంబంధిత శాఖలు స్పందించి నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల నిరంతర నిర్వహణ దృష్ట్యా చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో నెలకొన్న ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Next Story