కార్పొరేటర్ వర్సెస్ డాక్టర్ మధ్య మాటల యుద్ధం.. పీఎస్‌లో ఫిర్యాదు

by Vinod kumar |
కార్పొరేటర్ వర్సెస్ డాక్టర్ మధ్య మాటల యుద్ధం.. పీఎస్‌లో ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కార్పొరేటర్, వైద్యురాలి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ పద్మ కథనం ప్రకారం.. కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణులకు సరైన వైద్యం అందడం లేదని వచ్చిన ఫిర్యాదులతో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ బీష్వ సురేఖా ఓం ప్రకాష్ బుధవారం అనుచరులతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లింది. అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మిని కలిసి వైద్య సేవలలో జరుగుతున్న జాప్యం, నిర్లక్ష్యంపై ప్రశ్నించింది. దీంతో కార్పొరేటర్, సూపరింటెండెంట్‌ల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త పెద్దది కావడంతో డాక్టర్ రాజ్యలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విధి నిర్వహణలో ఉన్న తనను కార్పొరేటర్ అడ్డుకున్నారని ఫిర్యాదు చేసింది.

అనంతరం కార్పొరేటర్ బీష్వ సురేఖా ఓం ప్రకాష్ కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రజా ప్రతినిధిగా తాను సూపరింటెండెంట్‌ను కలిసి వైద్య సేవలలో నిర్లక్ష్యం గురించి అడిగేందుకు వెళ్తే తనపై దురుసుగా ప్రవర్తించిందని, నోటికొచ్చినట్లుగా మాట్లాడిందంటూ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ముందుగా ప్రభుత్వ విధులలో ఉన్న అధికారిని అడ్డకున్నారని కార్పొరేటర్‌పై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ జరుపుతున్నామని ఇన్ స్పెక్టర్ పద్మ తెలిపారు.

ఆది నుంచి వివాదాస్పదమే..

కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి మూడేళ్లకు పైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తీరు మొదటి నుండి కూడా వివాదాస్పదమేనని, కనీసం హాస్పిటల్‌లో పని చేసే వైద్యులు, సిబ్బందితో కూడా ఆమె సఖ్యతగా ఉండరనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, తల్లులనుద్ధేశించి నోటికొచ్చినట్లు మాట్లాడతారనే అపవాదు కూడా ఉంది. చివరకు మీడియా ప్రతినిధులను కూడా లెక్కచేయరు. ఇలా ఆమె తీరు వివాదాస్పదం గా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed