పెట్రోల్ పోసుకుని టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం

by Nagaya |   ( Updated:2022-09-06 07:44:00.0  )
పెట్రోల్ పోసుకుని టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, శేరిలింగంపల్లి : తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వక పోవడంతో మనస్తాపంతో తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నాయకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన అల్వీన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వీన్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నరసింహాచారి అల్వీన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటిముందు గత రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. మొఖం పై గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నర్సింహాచారి. బాధితుడు తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని, గతంలో ఇదే డివిజన్ నుండి టీఆర్ ఎస్ కార్పొరేటర్ టికెట్ ఆశించారు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చారి పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్‌గా ఉందని ఆయన బంధువులు తెలిపారు. పోలీసులు ఆయన వాంగ్మూలం సేకరించారని, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తనకు రూ.25 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఆయన ఇవ్వక పోవడం వల్లనే ఆత్మహత్యకు యత్నించానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని బాధితుడి భార్య శ్వేత తెలిపారు.

వెంకటేష్ గౌడ్ వల్లే మా భర్త ఆత్మహత్య యత్నం: శ్వేత

అల్వీన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మా భర్త దగ్గర 2016లో డబ్బులు తీసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మా భర్తకు అప్పట్లో కార్పొరేటర్ టికెట్ వస్తే నేను పోటీ చేస్తానని బతిమాలి, మాకు సహాయం చేస్తానని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి సహాయం చేయలేదు. కార్పొరేటర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే మా ఆయన ఆత్మహత్యయత్నం చేశాడు. మాకు న్యాయం చేయకపోతే మా పిల్లలతో కలిసి కార్పొరేటర్ ఇంటి ముందు ఆత్మహత్యకు పాల్పడతాం. ఆయనే బాధ్యత వహించాలి.

నాకేం సంబంధం లేదు: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

నర్సింహాచారి ఆత్మహత్యయత్నానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు. నేను ఆయన దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. ఒక్కోరికి ఒక్కోలా చెబుతున్నాడు. నేను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

Also Read : టీఆర్ఎస్‌లో కడియం వర్సెస్- తాటికొండ

Next Story