రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

by S Gopi |   ( Updated:2022-10-29 16:46:29.0  )
రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ బ్యాంకు అకౌంట్ నుంచి రెండు వారాల వ్యవధిలో 23 ఖాతాల్లోకి సుమారు రూ. 5. 22 కోట్ల నగదు బదిలీ అయిందని టీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి, వారికి పంచిపెట్టడం కోసమే వీటిని వేర్వేరు వ్యక్తులు, కంపెనీల్లోకి బదిలీ చేసిందని ఆ ఫిర్యాదులో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ శనివారం రాత్రి ఆరోపించారు. ఆ 23 బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన నగదును తీసుకోకుండా (విత్ డ్రా) ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే వాటిని విత్ డ్రా చేసినట్లయితే వాటిని ఏ అవసరాల కోసం వినియోగించిందీ వివరాలను తీసుకోవాలని కోరింది.

సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి ఏ రకంగానూ వ్యాపార సంబంధం లేని ఈ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఏయే ఖాతాల్లోకి ఎంత అమౌంట్ బదిలీ అయిందో, వాటి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంకు పేరు, బ్రాంచి వివరాలను ఈ ఫిర్యాదుతోపాటు టీఆర్ఎస్ పొందుపరిచింది. ఈ 23 ఖాతాలూ మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులవేనని టీఆర్ఎస్ అందులో పేర్కొన్నది. మునుగోడులో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వీరి ఖాతాల్లోకి వచ్చి పడిన రాజగోపాల్‌రెడ్డి డబ్బులు అక్కడి ఓటర్లకు పంచిపెట్టడం కోసమేనని తాము భావిస్తున్నామని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌దేనని పేర్కొని, ప్రలోభాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోమ భరత్ కుమార్ కోరారు.

Next Story