పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలు : హైకోర్టు న్యాయమూర్తి నంద

by Disha Web Desk 15 |
పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలు : హైకోర్టు న్యాయమూర్తి నంద
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : పొగాకు నమలడం, ధూమపానం వల్ల గుండె జబ్బులు, నోటి క్యాన్సర్ కు దారి తీస్తుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద అన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో పొగాకు వల్ల వచ్చే అనర్ధాలపై రూపొందించిన వాల్​పోస్టర్​ను న్యాయమూర్తి జస్టిస్ నంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు లోని నికోటిన్ విషతుల్యాలు రక్తనాళాల లోపల దెబ్బతీస్తుందని , తద్వారా గుండెపోటుకు దారితీస్తుందన్నారు.

నేటి యువత ధూమపానం, గుట్కా, పాన్ మసాలా వల్ల తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. షాపిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మీరా మాట్లాడుతూ దేశంలో సిగరెట్ల కారణంగా ప్రతి ఏటా 3.5 లక్షల మంది చనిపోతున్నారని , దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సాగించిందన్నారు. అందుకే పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు మేరకు సిగరెట్ల చిల్లరమ్మకాలపై నిషేధం విధించాలన్న యోచనలో ఉందన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్ కాకి సదానంద స్వామి ముదిరాజ్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా తమ సంస్థ సిగరెట్ గుట్కా, పాన్ మసాలా, తంబాకు తదితరాంశాలపై ప్రజలను జాగృతి శిబిరాలను నిర్వహిస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశిమోని శ్యాం రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మాకు ఆహారం కావాలి పొగాకు కాదు అనే నినాదంతో ప్రపంచమంతా పొగాకు నియంత్రణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంప్లాయిస్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాధారి రామ్మోహన్ , లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సౌత్ డైరెక్టర్ లయన్ ప్రేంచంద్ మునోత్ జైన్, సపిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ ఉర్మిదాస్, మంజుల , తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఢిల్లీ శివకుమార్, సి రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed