ప్రాపర్టీ టాక్స్ నెలసరి కలెక్షన్ రూ.100 కోట్లు టార్గెట్.. జీతాల చెల్లింపు లక్ష్యంగా నిర్ణయం

by Disha Web Desk 7 |
ప్రాపర్టీ టాక్స్ నెలసరి కలెక్షన్ రూ.100 కోట్లు టార్గెట్.. జీతాల చెల్లింపు లక్ష్యంగా నిర్ణయం
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ రూ.1681 కోట్లు వసూలు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనంగా రూ.200 కోట్లను పెంచి రూ.2,200 కోట్లను వార్షిక టార్గెట్‌గా నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వసూలైన ట్యాక్స్ నిధులు ఎప్పటికప్పుడు జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు, రొటీన్ మెయింటనెన్స్‌కు ఖర్చయిపోయాయి. నిన్నమొన్నటి వరకు అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీంతో రూ.786 కోట్లు వసూలైనా, మరో నెల రోజుల్లో ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపులు మరింత కష్టతరం కాకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో కలిపి నెలకు కనీసం రూ.వంద కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలన్న నిబంధన పెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న సుమారు 28 వేల మంది ఉద్యోగులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లను చెల్లించేందుకు నెలకు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్ల వరకు అవసరమవుతుంది.

ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ బకాయిపడ్డ ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మోటారు వెహికల్ ట్యాక్స్ వంటి వాటికి సంబంధించి ప్రతి నెల రూ.30 కోట్లను సర్కారు చెల్లిస్తుంది. వీటికి తోడు మరో రూ. వంద కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా సమకూర్చుకుంటే జీతాల చెల్లింపు సులభతరమవుతుందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం అమలు చేసే వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా అదనంగా వచ్చే కలెక్షన్, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే నిధులు రొటీన్ మెయింటనెన్స్‌కు వినియోగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఖజానాపై ఆర్థిక భారం..

శానిటేషన్, ఎంటమాలజీ, ట్రాన్స్‌పోర్ట్, వెటర్నరీ విభాగాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కార్మికుల జీతాలను రూ.వెయ్యి పెంచుతూ సర్కారు తీసుకున్న నిర్ణయం మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టయింది. జీతాల చెల్లింపునకు సంబంధించి అదనంగా పడే ఆర్థిక భారాన్ని పూచ్చుకునేందుకే నెలకు రూ.వంద కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు కూడా చర్చ లేకపోలేదు. నెలకు కనీసం రూ.వంద కోట్ల ట్యాక్స్ వసూలయ్యేందుకు వీలుగా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు పలు సూచనలు కూడా జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed