- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పగలు మునుగోడులో.. రాత్రికి నగరంలో.. ఆసక్తికరంగా 'మునుగోడు' ఉప ఎన్నికలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : త్వరలో జరుగనున్న మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక నగర ప్రజలలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఎన్నికకు జీహెచ్ఎంసీకి సంబంధం లేనప్పటికీ ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం వారి, హోరా హోరీ ప్రచారం తదితర అంశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమైనప్పటికీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఇటీవల వరకు మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి కాంగ్రెస్ పార్టీతో పాటు తన అసెంబ్లీ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ ప్రధాన పార్టీలు ప్రచారం, పాదయాత్రలు సాగిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పగలు మునుగోడులో.. రాత్రికి నగరంలో..
మునుగోడులో త్వరలో జరిగే ఉప ఎన్నికల కోసం హైదరాబాద్ నగరం నుండి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లి అక్కడ ప్రచారం చేపడుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి ఎవరా.. అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 21వ తేదీన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరనుండగా ఆ పార్టీ నుండి దాదాపుగా ఆయనే పోటీకి దిగనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి చాలా మంది టిక్కెట్లు ఆశిస్తుండడంతో అభ్యర్థి ఎవరనే విషయంలో ఆయా పార్టీల అగ్రనాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నారు.
ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా స్పష్టత లేనప్పటికీ మూడు ప్రధాన పార్టీలకు చెందిన నగర నాయకులు మునుగోడు బాట పడుతున్నారు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని సొంతంగా సర్వేలు సైతం నిర్వహించి పార్టీ నాయకత్వాలకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా నగరానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీల అధిష్టానం గుర్తింపు పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
ఎక్కడ చూసినా దళిత బంధు చర్చలే..
హైదరాబాద్ నగరంలో ఉద్యోగులు, వ్యాపారులు, నాయకులు, చివరకు కార్మికులు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై జోరుగా చర్చలు సాగిస్తున్నారు. టీ బండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ నలుగురు గుమికూడినా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుంది..? ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి..? ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఈ నెల 20వ తేదీన నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న సభలో మునుగోడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే అంశాలపై చర్చలు జోరందుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అమలులోకి తెచ్చిన దళిత బంధును ఇక్కడ కూడా కొనసాగిస్తారా..? బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీల కోసం ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు పార్టీలు..
మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే పాదయాత్రలు చేపడుతున్నారు. ఇక్కడి నుండి 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి ఇటీవల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెంచుకునేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.
మరోవైపు ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ అంశాలన్నీ నగరంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ నలుగురు గుమికూడినా మునుగోడు ఎన్నికల విషయం ఉంటోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకున్నా మునుగోడు ఉప ఎన్నిక జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇలా చర్చనీయాంశంగా మారింది.