హైదరాబాద్ మెట్రో ఘనత.. గ్రీన్ ఛానెల్‌లో మరోసారి గుండె తరలింపు

by Hajipasha |   ( Updated:2022-09-26 12:00:32.0  )
హైదరాబాద్ మెట్రో ఘనత.. గ్రీన్ ఛానెల్‌లో మరోసారి గుండె తరలింపు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు అవసరమైన సహాయం చేయడానికి ముందే ఉంటామని మరోసారి ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్‌అండ్‌టీ, ఎంఆర్‌హెచ్‌ఎల్‌, ఎస్‌ఓఎస్‌ కాల్‌ అందుకుందో అదే తరహా మరో కాల్‌ను అందుకుంది.

హెచ్‌ఎంఆర్‌ సోమవారం తెల్లవారుజామున గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటు చేసి.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. ఎల్బీనగర్‌ కామినేని హాస్పిటల్‌ డాక్టర్లు, ఇతర మెడికోలు దాదాపు ఒంటి గంటకు నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకురాగా.. తక్షణమే దానిని మెట్రో రైల్‌లో తరలించారు. కేవలం 25 నిమిషాలలో ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది అంబులెన్స్‌ ద్వారా గుండెను హాస్పిటల్‌కు చేర్పించారు.

మెట్రో లైన్‌ 3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఈ ప్రయాణాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణీకుల సేవకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కట్టుబడి ఉండటంతో పాటు.. అవసరమైన సమయాల్లో మరింత సేవలు అందించేందుకు ఉన్నామని తెలిపారు.

మరోసారి కూడా గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్‌ఎంఆర్‌ సిబ్బందికి ఎల్అండ్‌టీ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎండీ అన్నారు.

Next Story