- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీకి రక్షణ కరువు: సీపీఐ నారాయణ

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలాన్ని కబ్జా చేస్తున్న భూ బకాసురుల పై చర్యలు తీసుకోవాలని, వెంటనే వారిని ఖాళీ చేయించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. మంగళవారం శేరిలింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్రమించిన స్థలాన్ని అల్డీన్ కంపెనీ కార్మికులు, సీపీఐ కార్యకర్తలతో కలిసి సందర్శించారు. అక్కడి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కబ్జాకు గురైన క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికుల కుటుంబాల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.
తమకు ప్రాణహాని ఉందని, ప్రతీరోజు ఇళ్లలోకి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వ స్థలాలను కూడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జాలకు పాల్పడుతున్నాయని, అందుకు అల్డిన్ కంపెనీలో కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ రియలేస్టేట్ కంపెనీ చేస్తున్న కబ్జాలే నిదర్శనమని అన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆధీనంలో నడిచిన కంపెనీకి చెందిన స్థలాన్ని ఉన్న పళంగా ఓ ప్రైవేటు కంపెనీ కబ్జాలకు పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వారికి చెందిన స్థలమే అయితే అర్ధరాత్రి వందలాదిమంది రౌడీలను పెట్టి దౌర్జన్యంగా కంచెలు వేయడం ఏంటని ప్రశ్నించారు. అల్డీన్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోమని, ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు స్పందించకపోతే ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు: చారి (కార్మికుడు)
అల్డీన్ కంపెనీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి కంపెనీ కేటాయించిన క్వార్టర్లలోనే నివాసం ఉంటున్నామని.. కానీ గత కొన్నాళ్లుగా కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు ఈ స్థలం మాదంటూ అడ్డుగా కంచె వేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇండ్లలోకి వచ్చి ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కరెంట్, నీళ్లు నిలిపివేశారు. చివరకు డ్రైనేజీ పైప్ లైన్ కూడా పగల గొట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
క్షమాపణ చెప్పాకే మోదీ హైదరాబాద్ రావాలి: సీపీఐ నారాయణ డిమాండ్
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాకే హైదరాబాద్ రావాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి ఈనెల 26న నగరానికి రానున్న ప్రధాని దేశంలో రైతు చట్టాలను తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టారని, ఏదో ఒక సందర్భంలో రైతులకు మద్దతుగా మాట్లాడిన విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తూ ఇంటలీజెన్సీ వారు వారిని స్నాతకోత్సవానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యున్నత స్కూల్‌లో చదివి ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వెళుతున్న విద్యార్థులకు మోదీ ఇచ్చే సందేశం ఇదేనా అని నారాయణ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, సీపీ శేరిలింగంపల్లి కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కే. నరసింహారెడ్డి, సీపీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.