- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓయూలో జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి.. మండిపడుతున్న విద్యార్థి, ఉద్యోగ సంఘాలు

దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లో ధర్నాలు,ఆందోళనలను నిషేధిస్తూ యూనివర్సిటీ అధికారులు జారీచేసిన సర్క్యులర్ తో యూనివర్సిటీ లో ఆందోళనలు మొదలయ్యాయి. సర్క్యులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓయూలోని అన్ని విద్యార్ది సంఘాలు సర్క్యులర్ కు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఓయూ బంద్ కు పిలుపు నిచ్చిన నాయకులను ఉదయం నుండే ముందస్తు అరెస్టులు చేశారు. నిరసన ర్యాలీ చేపట్టిన విద్యార్దులను అరెస్టు చేసి అంబర్పేట్, నల్లకుంట, ఓయూ పోలీస్ స్టేషనులకు తరలించారు. దీంతో యూనివర్సిటీ లో వాతావరణం వేడెక్కింది.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ...వందేమాతర ఉద్యమం నుండి ఎన్నో అస్తిత్వ, ఆత్మగౌరవ, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాలకు పురుడు పోసింది ఉస్మానియా యూనివర్సిటీ అని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి దేశానికే దిక్సూచిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ అప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు జారీచేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఎన్నడు ఇలాంటి ఆంక్షలు చూడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సర్క్యులర్ పెట్టి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీకి దళిత విసి ని నియమిస్తే మేలు జరుగుతుంది అనుకుంటే, ఆంక్షలు పేరుతో విద్యార్థుల హక్కులను కాలరాయడం సిగ్గుచేటు అన్నారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించమంటేఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలంటే ఓయూ వైస్ ఛాన్సలర్ కి పట్టింపే లేదని దుయ్యబట్టారు. నియంతృత్వంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సర్క్యులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఉస్మానియాలో విద్యార్థులకు కేసులు కొత్త కాదని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. సర్క్యులర్ ను వెనక్కి తీసుకునే వరకు విశ్రమించేది లేదని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి: యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (సి) తెలంగాణ
యూనివర్సిటీ అధికారులు జారీచేసిన అప్రజాస్వామిక, నియంతృత్వ సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (సి) తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పరశురాం మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి, ఉద్యోగుల, అధ్యాపకుల సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరిస్తే ఉద్యమాలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటే... యూనివర్సిటీ అధికారులు ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం సరికాదన్నారు. తక్షణమే సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.