- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగు తల్లి విగ్రహం వద్ద ఉద్రిక్తత.. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అరెస్ట్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం హుసేన్ సాగర్ లో జరిగే విధంగా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన పలువురు ఉత్సవ సమితి ప్రతినిధులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే . ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోమవారం అఫ్జల్ గంజ్ లోని సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం హుసేన్ సాగర్ లో చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ హుసేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు .
ఈ మేరకు మంగళవారం పెద్ద సంఖ్యలో ఉత్సవ సమితి నాయకులు, కార్యకర్తలు బైకులతో హుసేన్ సాగర్ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే తెలుగు తల్లి విగ్రహం వద్ద మోహరించిన పోలీసులు.. తాళ్లు అడ్డుగా పెట్టి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు . దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకీ జై , వందే మాతరం, జై శ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. ముందుకు తోసుకువెళ్లేందుకు ప్రయత్నించిన సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు తో సహా పలువురిని తెలుగు తల్లి విగ్రహం వద్ద పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా డాక్టర్ భగవంతరావు మాట్లాడుతూ.. గతంలో వినాయక విగ్రహాల నిమజ్జనం హుసేన్ సాగర్ లో ఎలాగైతే నిమజ్జనం చేశారో ఇప్పుడు కూడా అలానే చేయాలన్నారు. విగ్రహాల వ్యర్థాలను 24 గంటల లోపు తొలగిస్తే నీరు కలుషితం కాబోదన్నారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.