వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం

by srinivas |
వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరంలో సుమారుగా 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని ఇది ఒక రికార్డు అని చెప్పారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధానం అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘనత కు రైతుల కృషి తో పాటు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రకృతి సహకారం నూతన వరి రకాలు అందుబాటులో ఉండటం కారణమన్నారు. రైతాంగానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందనీ సన్న రకాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ తో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు.

రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం, కేంద్ర నిల్వల కోసం 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు చేయగా ఇంకా సుమారు 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రంలో మిగులు ఉంటుందని వెల్లడించారు. మిగులు ధాన్యం మార్కెట్ చేయడానికి అన్వేషనలో భాగంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని ఫిలిప్పైన్స్ కు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడాన్ని సదావకాశంగా తీసుకొని ఆ ప్రభుత్వంతో నేరుగా అవగాహన ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు. దొడ్డు రకాలలో ముఖ్యమైన ఎంటియు -1010, ఐ. ఆర్-64 రకాలను రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారని వీటికి ఫిలిప్పీన్స్ లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. వరి సాగు లో ఇటీవల రైతాంగంలో ఆదరణ పొందుతున్న వరి నేరుగా విత్తే పద్ధతి రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం, తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. అధునాతన బియ్యం మిల్లులను ఒక డెమో రూపంలో ఆధునిక రైస్ మిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి ఆధునిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

తెలంగాణ బియ్యానికి శాశ్వతం పరిష్కారం దొరికింది : ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య

ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని ఎన్నటికీ స్వయం సమృద్ధి సాధించే దేశం కాదు. అందుకే ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్ గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లయితే తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లేనని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి బియ్యం ఔత్సాహిక ఎగుమతి దారులకు సరఫరా చేస్తే ప్రభుత్వానికి అయ్యే ఖర్చుకు సమానంగా ఔత్సాహికదారులకు ఇచ్చినట్లయితే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండానే ఎగుమతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి కృష్ణారావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, అపెడా అధికారులు, రైతు నాయకులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ఇటీవల విశ్వవిద్యాలయం నియమించిన యు జి సి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ సమరేండు మహంతి ఎగుమతుల విధానం అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు.

Next Story

Most Viewed