కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ...

by S Gopi |
కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ...
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాల్లో నిర్మిస్తున్న ఐదు లిఫ్టు పనులను తక్షణం ఆపేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే తక్కువ నీటి లభ్యత ఉన్నదని, మరో బేసిన్ పరిధిలోకి నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం ఈ లిఫ్టులను నెలకొల్పుతున్నదని తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డుకు ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌లను కూడా ఆహ్వానిస్తూ ఉన్నదని గుర్తుచేశారు. ఈ ఐదు లిఫ్టులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని, కృష్ణా బోర్డు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలోని గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టుల్లో భాగంగా వీటిని కొత్తగా నిర్మిస్తున్నదని ఆరోపించారు.

కడప, అనంతపురం జిల్లాల్లో జరుగుతున్న ఐదు రకాల సాగునీటి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అప్రెయిజల్ లేదని, తగిన అనుమతులు కూడా తీసుకోలేదని మురళీధర్ పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని మరో బేసిన్‌లోకి తరలించరాదని ట్రిబ్యునల్ గతంలోనే స్పష్టంగా చెప్పిందని, కానీ ఏపీ ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గండికోట ప్రాజెక్టు పెన్నా నదికి సంబంధించినదని, హంద్రీనీవా ప్రాజెక్టులో ఒక భాగమని మురళీధర్ గుర్తుచేశారు. కానీ శ్రీశైలం నుంచి నీటిని వాడుకుంటున్నదని, సత్యసాయి కెనాల్ సైతం తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమని తెలిపారు. ఇతర బేసిన్‌లలోకి కృష్ణా జలాలను తరలించడాన్ని తెలంగాణ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నదని నొక్కిచెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నూతన లిఫ్టు పంపులు, మోటార్లు, పైప్‌లైన్ నిర్మాణాలను అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు ఆ లేఖలో మురళీధర్ విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి ముద్దనూరు మండలంలోని మంగపట్నం చెరువుకు నీటిని తరలించేలా పంప్ హౌజ్‌ను, పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నదని మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు. మరో పైప్‌లైన్‌ను, లిఫ్టును ఇదే మండలంలోని గంగదేవిపల్లి చెరువుకు తరలించేలా టెండర్‌ను ఆహ్వానించిందని తెలిపారు. సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి బీఎన్ కండ్రిగ నుంచి సత్యసాయి కెనాల్‌ దగ్గర ఆఫ్ టేక్ స్లూయిజ్‌ను నిర్మించే పనులకు కూడా ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ముదిగుబ్బ సమీపంలోని జిల్లేలుబండ రిజర్వాయర్ నుంచి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి తదితర మండలాలకు హంద్రీనీవా కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు రెండు స్లూయిజ్‌లను నిర్మిస్తున్నట్లు వివరించారు. హంద్రీనీవా సెకండ్ ఫేజ్ ప్యాకేజీ 52 దగ్గర లిఫ్టు పంపులు, మోటార్లు, పైప్‌లైన్ పనులు జరుగుతున్నట్లు వివరించారు.

Next Story

Most Viewed