టార్గెట్ మిస్.. ఈ నెలాఖరుతో ముగియనున్న స్కీం

by Nagaya |
టార్గెట్ మిస్.. ఈ నెలాఖరుతో ముగియనున్న స్కీం
X

దిశ, సిటీబ్యూరో : స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.2 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు మూడు నెలల క్రితం సర్కారు అమల్లోకి తెచ్చిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) స్కీం అట్టర్‌ప్లాఫ్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.500 కోట్ల మొండిబకాయిల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు స్కీంను అమల్లోకి తెచ్చిన మూడు నెలల్లో కనీసం రూ.వంద కోట్లు కూడా కలెక్షన్ చేయలేకపోవడం స్కీం తుస్సుమన్నదనేందుకు నిదర్శనం. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ స్కీంతో ఈ సారి రూ.వంద కోట్లయినా కలెక్షన్ అవుతుందా? లేదానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జూలై 17న అమల్లోకి వచ్చిన ఈ స్కీం ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.80 నుంచి రూ.85 కోట్ల మధ్య కలెక్షన్ అయి ఉంటుందని అధికారవర్గాల సమాచారం.

గత సంవత్సరం ఇదే ఓటీఎస్ స్కీంను అమల్లోకి తెచ్చిన కేవలం నెలరోజుల్లోనే రూ.200 కోట్లు వసూలుగా కాగా, ఈ సంవత్సరం మూడు నెలలు గడుస్తున్నా, ఇంకా కలెక్షన్ కనీసం రూ.వంద కోట్లు దాటలేదంటే మొండిబకాయిలపై ఏకంగా 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ సర్కారు ప్రయోగించిన అస్త్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. మెయింటనెన్స్ పనులు చేసే సుమారు 1200 మంది కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.730 కోట్ల బిల్లులను ఎట్టిపరిస్థితుల్లో దీపావళి పండుగకు ముందే చెల్లిస్తామని హామీ ఇచ్చి, సమ్మెను విరమింపజేసిన అధికారులు ఓటీఎస్ ఫెయిల్ కావటం, రోజువారీ ప్రాపర్టీ ట్యాక్స్ కేవలం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మధ్య వసూలు కావటంతో బిల్లుల చెల్లింపులు, రోజువారి మెయింటనెన్స్, దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు జీతాల చెల్లింపు కోసం అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.

నెలాఖరు కల్లా రూ.510 కోట్లు కావల్సిందే

కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు మొత్తం రూ.800 కోట్లుండగా, వీటిలో రూ.70 కోట్లు ఇప్పటికే అధికారులు చెల్లించారు. దీంతో సంతృప్తి చెందని కాంట్రాక్టర్లు గత నెల 15 నుంచి సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. దీంతో రొటీన్ మెయింటనెన్స్ పనులు స్తంభించిపోయాయి. దీంతో అధికారులు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి, మిగిలిన బిల్లులు సుమరు రూ. 730 కోట్లను దీపావళి పండుగకు ముందే చెల్లిస్తామని హామీ ఇచ్చినా, మొత్తం రూ. 730 కోట్లు కాగా పోయినా అందులో సగం రూ. 365 కోట్లు, అక్టోబర్ జీతభత్యాలు, పెన్షన్లతో చెల్లించేందుకు రూ. 145 కోట్లతో కలిపి దాదాపు రూ. 510 కోట్లు ఖచ్చితంగా కావల్సిన పరిస్థితులేర్పడ్డాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా నిధుల సమీకరణ ఎలా విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు కాంట్రాక్టర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా? ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో జీతాలు అందుతాయో? లేదో? వేచి చూడాలి.

Next Story

Most Viewed