తెలంగాణలో మోడీ పర్యటన ప్రజలను మోసగించడమే: Tammineni

by Disha Web Desk 16 |
తెలంగాణలో మోడీ పర్యటన ప్రజలను మోసగించడమే: Tammineni
X

దిశ , తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ విభజన సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని మోడీ విషయంలో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎం మోడీ అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌, 3వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలలో పర్యటనకు వస్తున్నారని , ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని విమర్శించారు. రాష్ట్ర విభజన సందర్భంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, ఎన్‌టిపిసి 4వేల మెగావాట్ల విద్యుత్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, నీమ్జ్‌, ఐటిఐఆర్‌, కృష్ణాజలాల నీటి పంపకం, తెలంగాణకు ఇవ్వవలసిన మెడికల్‌ కాలేజీలు ` ఫార్మా నిమ్జ్‌, రైల్వేలైన్లు వంటి హామీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పి నేటికీ వాటి అమలు ఊసేలేదన్నారు. ఎటువంటి నిర్ధిష్టమైన కార్యాచరణ లేకుండా తెలంగాణలో పర్యటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని అయన ఆరోపించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. తుంగభద్రపై నీటి అనుమతి లేని ప్రాజెక్టుకు కర్నాటక ఎన్నికల కోసం జాతీయ వనరులు ఇచ్చి కానీ ఇక్కడ మాత్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు . తెలంగాణ పర్యటనకు ముందే రాష్ట్రానికి ఇవ్వాల్సిన అంశాలపై ప్రధాని నిర్ధిష్టంగా ప్రకటన చేయాలని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

Next Story