- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన టీచర్లు.. అవమానంతో సూసైడ్..

దిశ, ఎల్బీనగర్ : హయత్‌నగర్ శాంతినికేతన్ హై స్కూల్‌లో దారుణం జరిగింది. తోటి విద్యార్థుల ముందు అవమాన భారంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. దీంతో విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ గ్రామానికి చెందిన కరంటోత్ లక్‌పత్ కుటుంబం వలస వచ్చి హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసం ఉంటుంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కాగా కూతరు అక్షయ (13) హయత్‌నగర్‌లోని రాఘవేంద్రకాలనీ ఫేజ్-1లో ఉన్న శాంతినికేతన్ హై స్కూల్‌లో 8 వ తరగతి చదువుతుంది.
గురువారం స్కూల్ వెళ్లగా హోంవర్క్ చేయలేదని టీచర్లు అక్షయను రెండు గంటల పాటు ఎండలో మోకాళ్లపై నిలబెట్టారు. తోటి విద్యార్థుల ముందు అవమానం భారంతో ఇంటికి వచ్చిన అక్షయ తీవ్ర మనస్థాపానికి గురైంది. సాయంత్రం ఇంటి వచ్చిన తరువాత తోటి విద్యార్థినికి ఫోన్ చేసి తనకు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ఉందని చెప్పింది. అన్నట్లు గానే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
దీంతో విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని అక్షయను కిందికి దించారు. అప్పటికే అక్షయ మరణించింది. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తోటి విద్యార్థుల ద్వారా తెలిసింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు అక్షయ మృతదేహంతో శాంతినికేతన్ హైస్కూల్ ముందు ఆందోళనకు దిగారు.
ప్రాణం ఖరీదు రూ. 9 లక్షలు
వేదింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న అక్షయ కుటుంబసభ్యులు మృతదేహంతో శాంతినికేతన్ స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో యాజమాన్యం కాళ్ల బేరానికి వచ్చింది. కొంత మంది మధ్యవర్థుల ద్వారా విద్యార్థి నిండు ప్రాణానికి రూ. 9 లక్షలు వెల కట్టి చేతులు దులుపుకుంది.
విద్యార్థి సంఘాల ఆందోళన
మానసిక వేదనకు గురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో శాంతినికేతన్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతికి కారణమైన స్కూల్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు స్కూల్ పర్మిషన్‌ను రద్దు చేయాలని కోరారు. మృతురాలు అక్షయ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి అబ్ధుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తరలించారు.