- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బూర ఎఫెక్ట్... పల్లె రవికి నామినేటెడ్ పదవీ?

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో కంగుతిన్న కేసీఆర్ మునుగోడులో ఎన్నికల స్ట్రాటజీని చేంజ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు అమలు చేస్తోన్న ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి, కొత్త తరహాలో ముందుకు వెళ్లాలని లీడర్లకు సూచించినట్టు సమాచారం. డ్యామేజ్ కంట్రోల్ కోసం బీసీ లీడర్లు, ఓటర్లపై ఫోకస్ పెట్టాలని చెప్పినట్టు తెలిసింది. కేసీఆర్ డిల్లీ పర్యటనలో ఉండగానే మాజీ ఎంపీ బూర కేంద్ర బీజేపీ లీడర్లను కలవడం కేసీఆర్ షాక్ గురైనట్టు చర్చ జరుగుతోంది. బూర పార్టీ మారడంతో మునుగోడులో బీసీ ఓటర్లపై ప్రభావం ఉంటుందని గ్రహించిన కేసీఆర్ వెంటనే ఎన్నికల ప్రచార తీరును మార్చాలని ప్రచార బాధ్యతలు చూస్తోన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు తెలిసింది. బూర పార్టీ మారడంతో ఆయన స్థానంలో అదే కులానికి చెందిన పల్లె రవి దంపతులను పార్టీకి చేర్చుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. కేటీఆర్ వారిద్దర్ని పిలిచి, పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీలో చేరినందుకు పల్లె రవికి నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
బీసీ ఓటర్లే టార్గెట్
మునుగోడు అసెంబ్లీ సెగ్మంట్ లో సుమారు 1.50 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. వీరి పాత్ర పార్టీల గెలుపు ఓటముల్లో చాలా కీలకం కానుంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో బీసీ ఓటర్లు ఉన్నందునే టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా రెడ్డి కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు మరోసారి టికెట్ ఇచ్చాడు. దీంతో బూర టీఆర్ఎస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. కాషాయం కండువా కప్పుకున్న తర్వాత బూర నర్సయ్య బీసీ ఓటర్లను ఆకట్టుకునే తీరుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రహించే కేసీఆర్ బీసీ ఓటర్లను ఆకట్టుకునే తీరుగా ఎన్నికల ప్రచారాన్ని మార్చాలని సూచించినట్టు తెలిసింది. బీసీల్లో ఏ కులం ఓట్లు ఉన్నాయో లెక్కలు తీసి, ఆ ఓట్లు టీఆర్ఎస్ కు పడేందుకు కావాల్సిన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించినట్టు సమాచారం.
బీసీ స్కీమ్స్ పై ఫోకస్
ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న బీసీ సంక్షేమ పథకాల ద్వారా ఏ గ్రామంలో ఎంత మంది లబ్ధి చెందారో వివరాలు సేకరిస్తున్నారు. గొల్ల కురమలకు అమలు చేస్తోన్న గొర్ల పంపిణీ, చేనేతలకు అమలు చేస్తోన్న స్కీమ్స్, ముదిరాజులకు అమలు చేస్తోన్న చేప పిల్లల పంపిణీ స్కీమ్ వివరాలను ప్రచార సమయంలో వివరించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రతి గ్రామంలో కులాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారికి దగ్గరయ్యేలా ఎన్నికల ప్రచారం చేసే యోచనలో ఉన్నారు.