ఏందీ... వచ్చే నెల రేషన్ బియ్యం ఇయ్యరా..?

by S Gopi |   ( Updated:2022-10-19 13:41:43.0  )
ఏందీ... వచ్చే నెల రేషన్ బియ్యం ఇయ్యరా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రేషన్ బియ్యానికి కష్టకాలం వచ్చిందా, జిల్లాల్లోని గోడౌన్లలోనూ బఫర్ స్టాక్ ఉండడం లేదా అంటే ప్రస్తుత పరిస్థితులతో అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా 82 నుంచి 85 లక్షల మందికి ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం తదితర నిత్యావసరాలను సర్కారు అందిస్తోంది. గత రెండు నెలల నుంచి మాత్రం సివిల్ సప్లై రేషన్ ద్వారా అందించే బియ్యం విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. పౌరసరఫరాలకు సమయానికి అందాల్సిన బియ్యం మిల్లర్ల నుంచి రాకపోవడం, బఫర్ స్టాక్ లోనూ ఇబ్బందులు ఏర్పడడంతో రేషన్ లో ఇవ్వాల్సిన బియ్యంలో కోత విధిస్తూ సగం సగమే ఇవ్వాలని డీలర్లకు జిల్లాల డీఎంలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, రాష్ట్రంలోని మిల్లర్ల నిర్లక్ష్య వైఖరితోనే రాష్ట్రంలో రేషన్ లో అందించాల్సిన బియ్యానికి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. సర్కారు, సివిల్ సప్లై అధికారులు ఈ అంశంపై దృష్టి సారించకపోతే రేషన్ బియ్యానికి ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది. కాగా అక్టోబర్ లో బుధవారం నాటికి 62,74,879 మంది రేషన్ తీసుకున్నారు, కాగా సెప్టెంబర్ లో ప్రక్రియ పూర్తయ్యేవరకు 80,22,601 మంది అందుకున్నారు.

ఇన్‌స్టాల్ మెంట్లలో బియ్యం..

రేషన్ దుకాణాల్లో ఇవ్వాల్సిన నిత్యావసరాలు ఇవ్వకపోగా, ఇస్తోన్న బియ్యంలోనూ అధికారులు కోత విధిస్తుండడంతో బియ్యాన్ని ఇన్‌స్టాల్ మెంట్లలో తీసుకోవాల్సి వస్తోందంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ, ఏఎఫ్ఎస్‌సీ, ఎఫ్ఎస్‌సీ కార్డులు కలిపి మొత్తం 90.10 లక్షలున్నాయి. వీటిలో ప్రతి నెలా 82 నుంచి 85 లక్షల కార్డుదారులు రేషన్ ను తీసుకుంటున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపు రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్య వైఖరితో అసలు బియ్యమే సమయానికి అందడంలేదు. దీంతో ప్రతి నెలా 6వ తేదీన రేషన్ ను ఇస్తున్నారు.

ఆలస్యంగా ఇస్తున్నా.. మొత్తం బియ్యం ఇస్తున్నారా అంటే అదీ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పీఎంజీకేవై (ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన) కింద 5 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కేజీలు కలిపి ఉచితంగా నెలకు ఒక్కో మనిషికి 10 కేజీలను ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం కొరత ఏర్పడ్డ నేపథ్యంలో 10 కేజీలకు బదులు ముందుగా 5 కేజీలు ఇస్తున్నారు. అనంతరం స్టాక్ వచ్చిన తరువాత మరో 5 కేజీలు ఇస్తున్నారు. అయితే ఇందులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులు రావడంతో రేషన్ షాపులకు 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఇచ్చి, డీలర్లను మాత్రం లబ్ధిదారులకు 10 కేజీల చొప్పున ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నారు. మిగిలినవారికి స్టాక్ వచ్చిన తరువాత ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. దీంతో బియ్యం అందనివారు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం కోసం ఎన్నిసార్లు తిరగాలంటూ డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ 40 శాతం మాత్రమే రేషన్ ఇచ్చారంటే అతిశయోక్తి కాదు.

కార్డు పోర్టబిలిటీ..

ప్రస్తుతం జిల్లాల్లో బియ్యం కొరత ఏర్పడడంతో ఇతర జిల్లాల నుంచి స్టాక్ ను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా స్టేజ్ 1 నుంచి (ఎఫ్ సిఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యాన్ని రవాణా చేసే విధానం) బియ్యం రావడంలో ఆలస్యం జరుగుతోంది. మరోవైపు ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్ పాయింట్) నుంచి ఆయా డీలర్లకు కేటాయింపుల్లోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బియ్యం లేకపోవడంతో డీలర్లు 4 నుంచి 5 రోజులు దుకాణాలను మూసివేశారు. జిల్లాల్లో ఏర్పడుతున్న బియ్యం కొరత దృష్ట్యా అధికారులు కార్డులను పోర్టబిలిటీ చేస్తూ బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోర్టబిలిటీ కింద (ఉదాహరణకు ఖమ్మం నగరంలోని ఒక షాపులో బియ్యం లేకపోతే అదే ఖమ్మం నగరంలోని మరో షాపులో బియ్యం తీసుకునేలా లబ్ధిదారునికి వెసులుబాటు కల్పించడం) వివిధ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యాన్ని అందిస్తున్నారు. అయితే పోర్టబిలిటీ కింద ఇస్తున్న డీలర్లకూ బియ్యం సమయానికి అందడం లేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఆర్వో (రిలీజ్ ఆర్డర్) లు రావాల్సి ఉన్నది. ఈ ప్రక్రియకు సంబంధించి ఆర్వోలు వచ్చాయని తెలుస్తున్నది. ఆర్వోలు వచ్చినా సమయానికి అందించడానికి బియ్యం లేకపోవడం గమనార్హం.

మిల్లర్లతోనే సమస్యలు..

రాష్ట్రంలో రేషన్ లో అందించాల్సిన బియ్యంలోనూ కొరత ఏర్పడడానికి మిల్లర్లే కారణమన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సమయానికి సీఎంఆర్ అందించకపోవడం, కొన్ని సీజన్ల ధాన్యాన్ని తమ సొంత వ్యాపారం నిర్వహించుకోవడంతో ఇపుడు రాష్ట్రంలో రేషన్ దుకాణాలకు అందించే బియ్యంలో కొరత ఏర్పడిందని తెలుస్తోంది. ఇంత తతంగం నడుస్తున్నా పౌరసరఫరాల శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. చూడాలి మరీ దీనిపై అధికారులు, సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో.

Next Story

Most Viewed