కారులో వెళ్తున్న కంకి/సుత్తె కొడవలి!.... గుండెల్లో గుచ్చుకుంటుందంట

by S Gopi |
కారులో వెళ్తున్న కంకి/సుత్తె కొడవలి!.... గుండెల్లో గుచ్చుకుంటుందంట
X

దిశ, తెలంగాణ బ్యూరో: ''దేశంలో అప్రకటితపు ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. విపక్షాల గొంతులు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తున్నది. దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చింది. ఆ శక్తి టీఆర్ఎస్ కే ఉన్నది. అందుకు తోడ్పాటునందించే ప్రగతిశీల శక్తులను కలుపుకుని పోవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకుని వాపపక్షాలతో కలిసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టాం. దేశంలో కాంగ్రెస్ బలహీన పడిందని బీజేపీని బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడంలో భాగంగా వామపక్షాలతో కలిసి పోరాడుతాం. పై నుంచి మారుమూల కుగ్రామం వరకు ఈ సమన్వయం కొనసాగుతుంది''.. ఇదీ ఇటీవల నల్లగొండ జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్న మాటలు.

మరి ఈ ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతు ప్రకటన వచ్చింది. సీఎం కేసీఆర్ తోనూ ఆ పార్టీ నేతలు కలిసి చర్చించారు. నల్లగొండ జిల్లాలో కారు పార్టీతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టే వరకు వచ్చింది. రాష్ట్రంలో కాస్తో కూస్తో వామపక్షాలకు బలం ఉన్న మునుగోడులో కంకి కొడవలి, సుత్తె కొడవలి ఏ మేరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి. ఐతే సీపీఐ సీనియర్ నాయకులు సైతం ఇప్పటింకా గులాబీతో స్నేహాన్ని మాత్రం అంగీకరించలేదు. కారుకే ఓటు వేయాలన్న పిలుపునివ్వడానికి బదులుగా సామాజిక రుగ్మతలు, సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని, టీఆర్ఎస్ పార్టీ పోకడలను సోషల్ మీడియాలో ఎండగడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఒక్కో బాణం గుండెల్లో గుచ్చుకుంటున్నది. సీపీఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో పలు కీలక పదవుల్లో కీలక భూమిక పోషించిన ఓ నాయకుడు గులాబీతో దోస్తాన్ ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులే స్పష్టం చేస్తున్నాయి. వామపక్ష పార్టీల్లో పెద్ద నాయకుల్లోనే టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చడం లేదని తెలుస్తున్నది. అలాంటప్పుడు ఉప ఎన్నికల్లో కలిసి పని చేస్తారన్నది సందేహమే. పైగా రానున్న రోజుల్లో మునుగోడు సీటు కూడా దూరమవుతుందని కార్యకర్తల్లో నిరాశ కనబడుతున్నది.

బీజేపీకి మతతత్వ ముద్ర

ఆది నుంచి మునుగోడు నియోజకవర్గం సీపీఐ ప్రభావిత ప్రాంతమే. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకున్నా మునుగోడు సీపీఐకే కేటాయించేవారు. పొత్తుల్లో భాగంగా పలుమార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సీపీఐ శాఖ పని చేస్తున్నది. ప్రజా, కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసిన ఘనత వహించింది. కానీ ఉన్నట్టుండి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. రానున్న రోజుల్లోనూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బలంగా ఉన్న మునుగోడు దక్కుతుందా అన్నది సందేహం. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే సిట్టింగ్ సీటుగా చెప్పే అవకాశం లేకపోలేదు. గులాబీ దళం సిట్టింగ్ సీటును సీపీఐకి త్యాగం చేస్తుందా అన్న చర్చ నడుస్తూనే ఉన్నది. ఇదే విషయం గ్రామ శాఖ నుంచి రాష్ట్ర కమిటీ వరకు నడిచిందనే టాక్ ఉన్నది. ఏ లీడర్ ని కదిలించినా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది కదా అన్న నిట్టూర్పు తప్ప హర్షం వ్యక్తం చేసిన దాఖలాలైతే కనిపించలేదు.

సీపీఐ నేత కామెంట్స్ లో కొన్ని..

- బీజేపీ మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించుడే నా కర్తవ్యం అని చెప్తున్న కేసీఆర్.. హర్యానాలో జరిగిన బీజేపీయేతర పార్టీల మీటింగ్ కి ఎందుకు పోలేదు?

- మునుగోడు ఉప ఎన్నికలకు ఊరుకో ఎమ్మెల్యే, మండలానికి ఇద్దరు మంత్రులు, 100 ఓటర్స్ కు ఒక ప్రజా ప్రతినిధిని పంపుతున్నారంటే 8 సం. రాల పాలనపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను, ఓటర్లను కులాల వారిగా విభజించి కొత్త తాయిలాలు ఇవ్వడానికా! ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచుటకా! ఓటర్లను అవినీతిపరులుగా తయారు చేయటానికా! ప్రజాస్వామిక వ్యవస్థను అవినీతిమయంగా మార్చకండి!

- నేను తెలంగాణ కోసం బయల్దేరినప్పుడు.. గాంధీ లెక్కనే నన్ను ఎగతాళి చేసేవాళ్లు -కేసిఆర్! ఎగతాళి చేసిన వారికే ఎమ్మెల్యేలుగా చేసినావు.. మంత్రి పదవులు ఇచ్చినావు..! ఉద్యమంలో ముందున్నవారిని దూరం చేస్తున్నావు కేసీఆర్

- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేముందు.. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న 3.4 లక్షల మంది గిరిజనులకు వారి భూమిపై రక్షణ కల్పించండి!కేసియర్ గారు!

- మునుగోడు ఉప ఎన్నికల్లో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రచార కార్యక్రమం నిర్వహించే బాధ్యతలను ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడానికి ఏ విధంగా స్వాగతించాలి?

Next Story

Most Viewed