కేసీఆర్‌కు దిమ్మ తిరిగేలా ప్రశ్నలు వేసిన బాధితులు

by S Gopi |   ( Updated:2022-10-19 11:02:40.0  )
కేసీఆర్‌కు దిమ్మ తిరిగేలా ప్రశ్నలు వేసిన బాధితులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి స్వరాష్ట్ర ప్రజలపై ప్రేమ తగ్గినట్లుంది. పొరుగు రాష్ట్ర బాధిత రైతులంటే వల్లమాలిన అభిమానాన్ని కురిపిస్తున్నది. తెలంగాణ సొమ్ముతో అక్కడి వారిని ఆదుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ఇక్కడి బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ఎడతెగని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని సభ్యులకు తక్షణం సాయం అందించకుండా ఏండ్లుగా పెండింగ్ పెడుతున్నది. అదే ఇతర రాష్ట్ర బాధితులకు మాత్రం విమానంలో వెళ్లి చెక్కులు పంపిణీ చేసి ప్రచారం చేసుకుంటున్నారు.

దురదృష్టవశాత్తు ఎవరైనా పిడుగు పడి చనిపోతే ప్రకృతి వైపరీత్యం నిధి(ఎస్డీఆర్ఎస్) కింద రూ. 6 లక్షలు ఆ కుటుంబానికి అందించాలి. అది ఏదో కొంత ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం జీవో 22(తేదీ. 24-05-2022 రెవెన్యూ డిపార్టుమెంట్– డిజాస్టర్ మేనేజ్మెంట్) కింద 32 కుటుంబాలకు రూ.1.92 కోట్లు సాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పటికీ వారి అకౌంట్లో డబ్బులు వేయకుండా చెప్పులు అరిగెలా తిప్పించుకుంటున్నారు. అసలే కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దు:ఖంతో ఉన్న వారికి సాయం కూడా అందకపోవడంతో విలవిలలాడుతున్నారు. నిధులు మంజూరు చేసి ఐదు నెలలైనా వారికి ఎక్స్ గ్రేషియా సొమ్ము అందకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది.

21 సిఫారసులతో మంజూరు

గడిచిన 2-3 సంవత్సరాల్లో పిడుగుపడి 32 మంది చనిపోయినట్లు గుర్తించారు. వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కింద రూ. 6 లక్షల చొప్పున రూ.1. 92 కోట్లు మంజూరు చేశారు. ఐతే ఈ నిధులకు సంబంధించిన జీవో నెం. 22 ఉత్తగనే జారీ కాలేదు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్ధిక శాఖతో పాటు గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోతో కలిపి మొత్తం 21 సిఫారసులతో వచ్చింది. అంటే రూ. 1.92 కోట్లకు ఇన్ని రెఫరెన్సులు అవసరమయ్యాయి. కొత్తగూడెం జిల్లాలో ఒకరు, జగిత్యాలలో ఒకరు, భూపాలపల్లిలో ఒకరు, కామారెడ్డిలో ఇద్దరు, కరీంనగర్ లో ఒకరు, ఖమ్మంలో ముగ్గురు, ఆసిఫాబాద్ లో ఇద్దరు, మహబూబాబాద్ లో నలుగురు, మహబూబ్ నగర్ లో ఒకరు, నాగర్ కర్నూలులో ఒకరు, నల్లగొండలో ఇద్దరు, నిర్మల్ లో ఒకరు, నిజామాబాద్ లో ఒకరు, సిరిసిల్లలో ఒకరు, సంగారెడ్డిలో ముగ్గురు, సిద్ధిపేటలో ఇద్దరు, సూర్యాపేటలో ఇద్దరు, వనపర్తిలో ఒకరు, యాదాద్రి భువనగిరిలో ఇద్దరు వంతున 32 మంది చనిపోయారు. వారికి ఒక్కొక్కరికి రూ.6 లక్షల వంతున రూ.1. 92 కోట్లు మంజూరు చేశారు. మే 28న ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు నెలలైనా బాధిత కుటుంబాలకు మాత్రం ఎక్స్ గ్రేషియా అందించలేదు.

వెంటనే జమ చేయాలి

ఎవరు అడగకముందే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ చనిపోయినవారి కుటుంబాలకు రూ. 23 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము పంచిపెట్టారు. మన రైతు కుటుంబాలకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు. పిడుగుపడి చనిపోయినవారి కుటుంబాలు ఇప్పటికే పుట్టెడు శోకంలో ఉన్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వారి బ్యాంక్ ఖాతాలో మంజూరైన డబ్బులను వెంటనే జమ చేయాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల బాధితులను కలిసేందుకు విమానాల్లో వెళ్తారు. కానీ ఇక్కడి పేద బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడంలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తుండడం విమర్శలకు దారి తీస్తున్నది.

Next Story

Most Viewed