- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేవంత్ రెడ్డి ఇది నీకు తగునా!... అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లోనా?

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీపై ఉన్న అపారమైన భక్తిభావంతో నేతలు చేస్తున్న చేష్టలు పార్టీ పరువును గంగపాలు చేస్తుందనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా శనివారం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతల వ్యవహారశైలి సొంత పార్టీ క్యాడర్ తోపాటు విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాల్సిన నేతలు ఇలా వ్యవహరించడం పార్టీ పరువును బజారుకీడ్చడమే అనే టాక్ వినిపిస్తోంది.
అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లోనా?
కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పేరుకే ఎన్నిక అని చెప్పబడుతున్నా జరుగుతున్న వ్యవహారం దానికి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. తొలుత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉంటారని అంతా భావించారు. కానీ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకోవడం అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి రావడం వెనుక సోనియా గాంధీ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. చివరకు పోటీలో శశిథరూర్, ఖర్గే మాత్రమే మిగలడం వెనుక ఇదంతా ఆర్గనైజ్డ్ ఎలక్షన్ గా ప్రత్యర్థుల అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్ష పదవి నిమిత్తం ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం శశిథరూర్ హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో కీలక నేతలెవరూ ఆయన వద్దకు రాకపోవడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన సమీప బంధువుల్లో ఒకరు చనిపోవడంతో మీ ప్రచారానికి రాలేకపోతున్నానంటూ రేవంత్ రెడ్డి చెప్పారని శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో ప్రసంగం దంచికొట్టాడు. దాంతో శశిథరూర్ ప్రచారానికి హాజరు కాకుండా ఏదో సాకుతో రేవంత్ రెడ్డి తప్పించుకున్నారనే టాక్ వినిపించింది. పార్టీలోని మిగతావారు సైతం ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా శనివారం ప్రచారం నిమిత్తం హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే రాగా రేవంత్ రెడ్డితో సహా పార్టీ నేతలంతా కట్టగట్టుకుని కలిసి రావడం ఇది ముమ్మాటికి పక్షపాతమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. శశిథరూర్ ను కనీసం పట్టించుకోకుండా మల్లికార్జునకు మాత్రమే జేజేలు పలుకుతున్న టీ కాంగ్రెస్ నేతల వైఖరి అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్న చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సోనియా చేతిలోనే రిమోట్?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8వ తేదీ ఆఖరు గడువు. ఈరోజు సాయంత్రం వరకు శశిథరూర్, ఖర్గే పోటీ నుంచి తప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. పోటీలో కొనసాగితే అక్టోబర్ 17న ఎన్నిక, 19న కౌంటింగ్ నిర్వహించి అదేరోజు రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే ఈ తంతంగంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వట్టి బూటకం అని కొట్టిపారేస్తున్నారు. ఎవరు గెలిచినా రిమోట్ సోనియా గాంధీ చేతుల్లోనే ఉంటుందని, ఇంతదానికే ఈ అధ్యక్ష ఎన్నికలు హడావుడి దేనికని ప్రశ్నిస్తున్నాయి. సోనియా గాంధీ తమకు అనుకూలమైన వారికి మద్దతు తెలిపేలా పార్టీలో వ్యవహారం సాగిస్తోందని శశిథరూర్ విషయంలో నేతలు పట్టించుకోకపోవడం, ఖర్గే విషయంలో బహిరంగంగానే మద్దతు ప్రకటించడం చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శశిథరూర్ తో రేవంత్ కు గతంలో విభేదాలు ఉన్నాయని.. అందువల్లే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయనకు ప్రాముఖ్యత లేకుండా తెలంగాణలో ఖర్గేకు ఏకపక్షంగా జైకొట్టిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో ప్రజాస్వామ్యం అంటూ పైకి గప్పాలు చెబుతున్న హస్తం నేతలు రియాల్టిలో పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి చర్యలు పార్టీ పరువును గంగపాలు చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.