దసరా కానుకగా యువతకు భారీ గుడ్ న్యూస్...

by Dishanational1 |
దసరా కానుకగా యువతకు భారీ గుడ్ న్యూస్...
X

ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఏదైనా అంశంలో నిర్ణయం తీసుకుంటే.. ఆ దిశగానే ప్రత్యర్థి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం వారుసులనే ముద్దు చేస్తున్నది. సాధారణంగా సీనియర్లు ఉంటే వర్గ రాజకీయాలకు చెక్ పడుతుందని.. ఫలితంగా అన్ని వర్గాలు సమిష్టిగా పనిచేస్తాయని సీఎం జగన్​అంచనా వేస్తున్నారు. కానీ, టీడీపీ మాత్రం యువతకే టికెట్లు ఇస్తామని గతంనుంచీ ప్రకటిస్తున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నాయి. భావి నేత లోకేశ్​ను పార్టీలోని చాలామంది సీనియర్లు అంగీకరించలేకపోతున్నారు. ఆయన కూడా సీనియర్లను దగ్గరికి రానివ్వడంలేదు. ఈ నేపథ్యంలో సీనియర్లను వద్దని వారి ముఖం మీదే చెప్పలేక.. వారి వారసులను రంగంలోకి దింపాలని చంద్రబాబు మధ్యేమార్గం చూపిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో కాలు మోపనుండటంతో పార్టీలోని కొందరు సీనియర్లు జంప్​ అవుతారంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ల వారసులు ఆ ఖాళీని పూడ్చే అవకాశమూ లేకపోలేదని మరికొందరి అంచనా. ఏదిఏమైనా జగన్, చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరి వ్యూహాలకు వారు పదను పెడుతున్నారు. అంతిమంగా ఎవరికి పట్టం కడుతారనేది ప్రజలే తేల్చాలి.

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయాల్లో వ్యూహాలు పైకి సులభంగానే కనిపించినా..? దాని వెనుక కారణాలు అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. ప్రత్యర్థుల విషయంలో అయితే, ఆ వ్యూహాలు కత్తి కంటే పదనుగా ఉంటాయి. ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న కొన్ని అంశాలు ఎవరికీ అంతుపట్టడంలేదు. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదంటూ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే.. టీడీపీ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నది. సీనియర్లకంటే జూనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నది. పార్టీ భవిష్యత్ అధినేతగా ప్రచారంలో ఉన్న నారా లోకేశ్​కు అండగా ఉండాలంటే యువతరాన్నే రంగంలోకి దించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. రానున్న ఎన్నికలు టీడీపికి గట్టి సవాల్ విసరబోతున్నాయి. అంతేకాదు ఆయన రాజకీయ చతురత, వ్యూహాలకు కఠిన పరీక్ష ఎదురుకాబోతున్నది. భారతీయ జనతాపార్టీ 2029 ఎన్నికలు టార్గెట్ గా ఏపీని ఎంచుకుంది. మరోవైపు కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రంలో తిష్టవేయడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ సీనియర్లు జంప్​అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆయన ప్లాన్​బీగా యువతకు అవకాశం ఇవ్వాలని, అందులోనూ సీనియర్ల వారసులకు ఇస్తే గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతారని భావిస్తున్నారు. దీంతో 2024 ఎన్నికలు టీడీపీకి విషమ పరీక్షలా నిలిచాయి.

యువతకే పెద్దపీట

ఏపీ సీఎం జగన్ 2024లో తాను ఎటువంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదని, వారసులెవరికీ చోటులేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం 40 శాతం పైగా యువతే ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు నారా లోకేష్ జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. లోకేశ్​కు, సీనియర్ నేతల మధ్య సమన్వయం సరిగా కుదరలేదన్న విమర్శలు నేపథ్యంలో లోకేష్ సమకాలికులను రంగంలోకి దించాలని బాబు నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా మూడుసార్లు పోటీచేసి ఓటమిపాలైన నేతలకు సీట్లు లేవని ఒంగోలులో జరిగిన మహానాడులో స్పష్టం చేశారు.

సీనియర్లకు బదులు వారసులు

వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలకు బదులుగా వారి వారసులను రంగంలోకి దించబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ వారసులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కొవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు దినేశ్​రెడ్డికి నియోజకవర్గ ఇన్​చార్జీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఎదుర్కోబోయేది దినేశ్​రెడ్డి అని తెలిసిపోయింది. అలాగే, నర్సీపట్నంలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ చాలా యాక్టివ్ అయ్యారు. జ్యోతుల నెహ్రు కుమారుడు, ఆదిరెడ్డి అప్పారావు వారసుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ కుమారుడు లాల్ తో సహా చాలామంది సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు.

వారసుల ప్రయోగానికి లిట్మస్ టెస్ట్

2014 ఎన్నికల్లో పొలంరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం కైవసం చేసుకున్నారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చురుగ్గా తిరగడం తగ్గించారు. నియోజకవర్గంలో తమకు దిశా నిర్దేశం చేసే నేత లేకపోయేసరికి కేడర్ అయోమయానికి గురైంది. ఈ క్రమంలో చంద్రబాబు దినేశ్​రెడ్డి పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో సీటు ఖరారు కావడంతో దినేష్ శరవేగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. యువనాయకుడికి పదవి దక్కడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి. ఈ కొత్త వారసుడు కోవూరులో సత్తా చాటుతాడా? లేదా?చర్చ టీడీపీలో మొదలైంది. తనకి సరైన మద్దతు ప్రజల నుండి లభిస్తే.. మిగిలిన చోట్ల కూడా వారసులను రంగంలో కి దించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే..!


Next Story

Most Viewed