- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఆర్ఎస్ అంటే.. బార్ అండ్ రెస్ట్రారెంట్ సర్వీస్ పార్టీ: షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేసింది. ఆ ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని శుక్రవారం ఢిల్లీలో సీబీఐకి ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. ఆమె చేసిన ఫిర్యాదుపై డీఐజీ ర్యాంక్ ఆఫీసర్ తో విచారణ జరిపిస్తామని సీబీఐ డైరెక్టర్ హామీ ఇచ్చారని తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలని సవాల్ విసిరింది. తన తండ్రి వైఎస్సార్ రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. కేసీఆర్ దొర డిజైన్లు మార్చి, పేరు మార్చి రూ. 1. 20 లక్షల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచాడని విమర్శలు చేసింది. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్టుకు.. కరెంట్ బిల్లులే రూ. వేల కోట్లు కడుతున్నాడని ధ్వజమెత్తింది. వైఎస్సార్ నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని, అదే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే మునిగిపోయిందని ఎద్దేవా చేసింది. 'మెగా' కంపెనీ నాణ్యత లేని పనులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆమె ఫైరయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి ప్రజల సొమ్మును పీక్కుతిన్నారని, ప్రాజెక్టులో అడుగడుగునా ఇంజినీరింగ్ లోపాలు కనపడుతున్నాయని పేర్కొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఒక ఏటీఎంలా మారిందని, ఆ ప్రాజెక్టుతో రూ. వేల కోట్లు సంపాదించాడని ఆమె ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దలు కూడా చెబుతున్నారని, కానీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ వేయించడంలేదని ఆమె ప్రశ్నించింది. టీఆర్ఎస్ కు 'బీ' టీంగా బీజేపీ పనిచేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేసింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, ప్రజల సొమ్ము కాపాడడం కోసం కాళేశ్వరం అవినీతిపై ఆఖరివరకు పోరాడుతామని తెలిపింది. ఇలాంటి అవినీతి, అక్రమాలు దేశం మొత్తానికి పాకక ముందే మొదళ్లోనే తుడిచేయాలని షర్మిల వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ 'మెగా'కే ఎందుకు ఇస్తున్నట్లని ఆమె ప్రశ్నించింది. మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో జనానికి చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. కాళేశ్వరం స్కాం దేశంలోనే అతి పెద్దదని, కేంద్రానికి సంబంధించిన శాఖల నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరాయని.. యావత్ దేశ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరమని, ఇలాంటి ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఎన్నికలు కావని, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక ఎమ్మెల్యేతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటే వచ్చిందని షర్మిల వ్యాఖ్యానించింది. అయిదేండ్లు సేవ చేస్తానని వాగ్ధానం చేసిన ఎమ్మెల్యే మధ్యలోనే తన స్వార్థం కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయాడని ధ్వజమెత్తింది. అటు టీఆర్ఎస్ పార్టీ అధికారమదం, అహంకారం చాటుకోవడానికి ఉప ఎన్నికల్లో వేల కోట్లు డబ్బు ఖర్చు చేస్తోందని ఆరోపణలు చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదని పేర్కొన్నది. ఇది మూడు పార్టీల మధ్య వీధిలో కుక్కల కోట్లాటలా మారిందని సెటైర్లు వేసింది. ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా పెట్టారని, ఒక్కో ఓటుకు వేల రూపాయలు తాయిలాల కింద అందిస్తున్నారని ఆరోపించింది. కేసీఆర్ పాలన ఇలానే కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం అమ్మకాలతోనే రాష్ట్రం నడుస్తోందని షర్మిల పేర్కొన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మద్యంపై రూ.10 వేల కోట్లు ఉన్న ఆదాయం నేడు రూ. 40 వేల కోట్లకు పెరిగిందని ఆమె అన్నది. తద్వారా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయని, అప్పులతో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని మండిపడింది. ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నాడని ఫైర్ అయ్యింది. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్ట్రారెంట్ సర్వీస్ పార్టీ అనే అనుకోవాలని షర్మిల సెటైర్లు వేసింది.