నాకు మెఘా కృష్ణారెడ్డి నుండి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే... : షర్మిల

by S Gopi |   ( Updated:2022-10-22 14:23:11.0  )
నాకు మెఘా కృష్ణారెడ్డి నుండి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే... : షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున స్కాం జరిగిందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది రాష్ట్ర స్థాయి అవినీతి కాదని జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం అని అన్నారు. శనివారం లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 16 వేల కోట్ల రూపాయలతో వైఎస్సార్ ప్రాణిహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటే కేసీఆర్ దాని వ్యయాన్ని మూడింతలు పెంచి వైఎస్సార్ చెప్పిన దానికంటే ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం గతంలో వెలుగు చూసిన 2జీ స్కాం కంటే పెద్దదని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల డబ్బులను దోచుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కు ఈ ప్రాజెక్టులో వాటా ఉందని అందువల్లే ప్రతి ప్రాజెక్టును మెఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నాడని ఆరోపించారు. ఒకప్పుడు స్కూటర్ పై తిరిగే కేసీఆర్ ఇప్పుడు విమానం కొనగలిగే రేంజ్ కి ఎలా ఎదిగాడని.. మెఘా కృష్ణారెడ్డి ఏమైనా కేసీఆర్ కు బామ్మర్దా? ఎందుకు డబ్బులు ఊరికే ఇస్తున్నాడని ప్రశ్నించారు. అతడికి ఏదో లాభం ఉందనే కేసీఆర్ కు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు. తమకు తెలిసిన సమాచారంతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని కానీ ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

బండి సంజయ్, రేవంత్ రెడ్డి మెఘా కృష్ణారెడ్డికి జీతగాళ్లా? వీళ్లకు బాధ్యత లేదా? డబ్బు కోసం దేనికైనా అమ్ముడుపోతారా? దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నించాలన్నారు. మెఘా కృష్ణారెడ్డి మీడియా సంస్థలను, ఇతర పార్టీల నేతలతోపాటు అధికారులను కూడా మేనేజ్ చేస్తున్నాడు అని ఆరోపించారు. టీవీ9తోపాటు, సాక్షికి కూడా మెఘా కృష్ణారెడ్డి డబ్బులతో ఇన్ ఫ్లూఎన్స్ చేస్తున్నాడని ఆరోపించారు. మెఘా కృష్ణారెడ్డి నుండి తనకు రూ. 1000 కోట్ల డీల్ వచ్చిందని కానీ నేను డబ్బులకు ఆశపడేదాన్ని కాదని అన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిపోయిందని కామెంట్స్ చేసి వెళ్లిపోతున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదని ఈ అవినీతిపై మేము తప్ప ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. సీబీఐ, కాగ్, ఈడీని ఎందుకు విచారణకు ఆదేశించడంలేదని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నంచడం లేదో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మేల్కోకపోతే రాష్ట్రం మొత్తాన్ని కేసీఆర్ లూటీ చేయడం ఖాయం అన్నారు. బీజేపీ దీనిపై విచారణకు అదేశించకుంటే టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న బిడ్డను వెంటేసుకుని ఢిల్లీకి వెళ్లారంటే ఎవరి కాళ్లు మొక్కేందుకు అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కేసీఆర్ అధికారిక టూర్ మీద ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేస్తే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని ఇది కుక్కల కొట్లాటగా అభివర్ణించారు. మునుగోడులో డబ్బు ప్రవాహం వెల్లువెత్తుతోందని రూ. 1000 కోట్లతో ఇది దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికగా మారిపోయిందన్నారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కు మాత్రం ఓటేయవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలు బీజేపీ నెరవేర్చలేదని అలాంటి బీజేపీ ఇప్పుడు సిగ్గులేకుండా మునుగోడులో ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో తన మద్దతు కావాలని పార్టీలు అడిగాయని కానీ తాము ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాడి తమ్ముడికి ఓటు వేయాలని అనడంతో ఈ విషయం స్పష్టం అవుతోందన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నాడని అది చేస్తే దరిద్రం వదులుతుందన్నారు. 99 శాతం మంది లబ్ధిదారులు తమకు మద్దతుగా ఉంటే మునుగోడులో టీఆర్ఎస్ ఇంతమంది ఎమ్మెల్యేలను, మంత్రులను ఎందుకు మోహరించిందని ప్రశ్నించారు. ఒక బై ఎలక్షన్ లో ఒక గ్రామానికి ఇంచార్జీగా ముఖ్యమంత్రిగా ఉండడానికి సిగ్గులేదా అని ఫైర్ అయ్యారు. తాను చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్ లో డిసెంబర్ లో ముగుస్తుందన్నారు. పార్టీలోకి ఎవరు చేరినా చేరకపోయినా వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్ టీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

జోడో యాత్ర వల్ల తెలంగాణలో ఒరిగేదేమిలేదని రాహుల్ గాంధీ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. ప్రెస్ మీట్ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల సంచలన విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లో తనకు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ కాదని తన తండ్రి వైఎస్సారే తన రోల్ మోడల్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పాలేరులోనే పోటీ చేస్తానని, పాదయాత్ర తరువాత పాలేరుపై దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ పెట్టిన ఏడాది లోపే ప్రజల అభిమానం చూరగొన్న వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ పార్టీ కంటే బెటర్ అని అన్నారు. జగ్గారెడ్డిపై పాస్ పోర్ట్ కేసు ఉందని పాదయాత్రలో ఉన్నప్పుడు తనకు తెలియదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నానని అయితే తనకు ప్రధాన ప్రతిపక్షం కేసీఆరే అని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అని తేలిపోయిందని అన్నారు. మెఘా కృష్ణారెడ్డి నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పారు. కేసీఆర్ ది భారత్ రాష్ట్ర సమితి కాదని బంధిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి :

ఆ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రోబో.. గెలుపు ఆ పార్టీదేనా?

Next Story