లష్కర్ బీజేపీలో వర్గపోరు.

by srinivas |
లష్కర్ బీజేపీలో వర్గపోరు.
X

దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ దూసుకుపోతుంటే మరోవైపు సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రం వర్గపోరుతో కునారిల్లుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించే నాయకులు ఎక్కువవడంతో ఎవరికి వారే ప్రత్యేక గ్రూప్లను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేస్తుండడంతో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది. ఈ ముఠా రాజకీయాలను చూసి కార్యకర్తలు సైతం ముక్కన వేలేసుకుంటున్నారు. సాక్షాత్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిస్థితి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం దీనిని చక్కదిద్దాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నియోజకవర్గంలో పార్టీకి జవసత్వాలు చేకూర్చిన బండపల్లి....

సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా బలహీనపడిన సమయంలో ఎన్నారై పారిశ్రామికవేత్త బండపల్లి సతీశ్ కుమార్ రంగ ప్రవేశం చేసి పార్టీకి జవసత్వాలు చేకూర్చారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నించి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి పార్టీని మూడోస్థానంలో నిలిపారు. దానితరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇతర పార్టీల నుంచి పలువురు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ అంతర్గత వర్గపోరుతో కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. దీంతో పార్టీ ప్రజల్లో చులకనవుతోంది.

గ్రేటర్ ఎన్నికల్లో నియోజకవర్గంలో దక్కని ప్రాతినిధ్యం.....

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అనూహ్య రీతిలో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో కనీసం మూడైనా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని అందరూ భావించారు. కానీ పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరుతో ఒక్క డివిజన్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందలేకపోయారు. దీంతో జీహెచ్ఎంసీలో నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది.

ఎలాంటి కార్యక్రమాలకైనా హాజరు అంతంతమాత్రమే...

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏవి జరిగినా ఒక నాయకుడు హాజరైతే ఇతర నాయకుల వర్గం నుంచి ఎవరూ హాజరుకాని పరిస్థితి నెలకొంది. దీంతో కార్యకర్తల్లో సైతం నిరుత్సాహం చోటుచేసుకుంటోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు తమ వెంట వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తూ, ఆదినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని పట్టించుకోకపోవడం కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మూడు, నాలుగు పార్టీలు మారి వచ్చిన నాయకుడు సైతం తనకే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని ఒక వర్గాన్ని వెనకేసుకుని గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.

ఇప్పటికైనా విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని కోరుతున్న కార్యకర్తలు....

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తున్న తరుణంలో లష్కర్ పై దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికైనా నాయకులంతా విబేధాలు పక్కనపెట్టి ఉమ్మడిగా పనిచేస్తే లష్కర్ ఎమ్మెల్యే సీటు గెలుపొందడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. టికెట్ ఎవరికి దక్కినా అందరూ సమిష్టిగా అందరినీ కలుపుకుని

పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని సూచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుని నాయకుల మధ్య విబేధాలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story