పార్కింగ్‌ల ముసుగులో సిట్టింగులు.. హయత్ నగర్ ఎక్సైజ్ పరిధిలో రూల్స్ బేఖాతర్!

by Disha Web Desk 19 |
పార్కింగ్‌ల ముసుగులో సిట్టింగులు.. హయత్ నగర్ ఎక్సైజ్ పరిధిలో రూల్స్ బేఖాతర్!
X

రాష్ట్రంలో మ‌ద్యం ఏరులైపారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మ‌ద్యాన్నే ప్రధాన ఆదాయ వ‌న‌రుగా చేసుకోవ‌డంతో విచ్చల విడిగా మ‌ద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం న‌గ‌రంలో వీరి దందా మూడు బీర్లు.. ఆరు విస్కీలుగా.. సాగుతోంది. గుడి.. బ‌డి.. జాతీయ ర‌హ‌దారి అనే తేడా లేకుండా య‌థేచ్చగా మ‌ద్యం విక్రయాల‌ను చేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వమే మ‌ద్యం అమ్మకాలు పెంచాల‌ని అబ్కారీ శాఖ‌ను ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్‌ల యాజమాన్యాలతో కుమ్మక్కై అడ్డదారులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాపులు ఎక్కడా నిబంధ‌న‌లు పాటించ‌డంలేదు. అధికారులు మ‌ద్యం వ్యాపారుల నుంచి అన‌ధికారిక వ‌సూళ్లకు పాల్పడ‌డం వ‌ల్లే ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: రాష్ట్రం ప్రభుత్వం మ‌ద్యం అమ్మకాల‌తో వ‌చ్చే ఆదాయంపై ఆధార‌ప‌డ‌డంతో ఆబ్కారీ శాఖ అధికారులు మామూళ్ల మ‌త్తులో జోగుతున్నార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఫ‌లితంగానే ఎల్బీన‌గ‌ర్ నుండి హ‌య‌త్‌న‌గ‌ర్ వ‌ర‌కు ఉన్న వైన్ షాపులు పార్కింగ్ స్థలాన్ని సిట్టింగ్‌లకు ఉపయోగిస్తున్నారు ఈ ప్రాంతంలో వైన్ షాపు య‌జ‌మానులు ఎక్కడా, ఏ విధమైన నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు. ఇక జాతీయ ర‌హ‌దారిపై వైన్ షాపుల‌కు గానీ, బార్‌ల‌కు గానీ ఎటువంటి అనుమ‌తి ఉండ‌దు. అయినా అడుగుకో వైన్ షాపు, వంద మీట‌ర్లకో బార్ షాపులు ద‌ర్శన‌మిస్తాయి. వీటిని నియ‌త్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు. వీటికి తోడు ప్రస్తుతం ప్రతి వైన్ షాపు వ‌ద్ద వాక్ఇన్ లిక్కర్ హౌజ్‌లు ఏర్పడ్డాయి.

నిబంధ‌న‌లే అధికారుల‌కు వ‌రం..!

బ‌హిరంగ ప్రదేశాల‌లో మ‌ద్యం తాగ‌కుండా ప్రతి షాపుకి ప‌ర్మిట్ రూంకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇది 10×10 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉండాలి. సిట్టంగ్‌కు ఎటువంటి అవ‌కాశం ఉండ‌కూడ‌దు. వండిన ఆహార ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేయ‌రాదు. ఎటుంటి తినుబండారాలు అమ్మ‌కూడ‌దు. కానీ ఎక్కడా ఇది అమ‌లు కావ‌డం లేదు. కొన్ని చోట్లయితే ఏకండా ఎకరం, అర ఎక‌రం స్థలంలో బార్లను త‌ల‌పించే రీతిలో ఏర్పాటు చేసి రెస్టారెంట్‌ల త‌ర‌హాలో వంట‌కాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

ఇలా నిబంధ‌న‌ల‌ను ఉల్లఘించే షాపుల‌ను ఆబ్కారీ అధికారులు సీజ్ చేయాలి. కానీ చేయ‌రు..? ఎవరైనా ఫిర్యాదు చేస్తే వైన్ షాప్ యాజమాన్యాలతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కై, ఆమ్యామ్యాలు పుచ్చుకొని సిట్టింగ్ ప్రాంతాన్ని పార్కింగ్ స్థలంగా చూపిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నట్లు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక ఎక్సైజ్ అధికారుల తప్పుడు నివేదికలకు జిల్లాస్థాయి అధికారులు కూడా తానా అంటే తందానా అంటూ వంత పాడుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి

తప్పుడు నివేదికలకు వంత పాడుతున్న జిల్లా స్థాయి ఎక్సైజ్ ఉన్నతాధికారులు..

ప్రతి రోజు మ‌ద్యం విక్రయించార‌నే వివ‌రాల విధిగా స్టాక్‌బుక్‌లో న‌మోదు చేయాలి. చాలా మంది ఈ స్టాక్ బుక్‌ను స‌క్రమంగా నిర్వహించ‌రు. ఒకవేళ ఎక్సైజ్ అధికారుల త‌నిఖీలలో వివ‌రాలు స‌రిగా న‌మోదు చేయ‌లేద‌ని గుర్తిస్తే రూ. 10 వేల నుండి రూ. 20 వేల వ‌ర‌కు జ‌రిమానా విధించాలి. పర్మిట్ రూం స్థలం పరిమితికి మించిన విస్తీర్ణంలో ఉంటే అక్కడ ఉన్న ఒక్కొక్క మందుబాబుపై వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ వైన్ షాప్ యాజమాన్యాల నుంచి వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని విమర్శలు హయత్ నగర్ ఎక్సైజ్ పరిధిలో జోరుగా వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed