ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టిస్తాం: ఎండీ సజ్జనార్

by Vinod kumar |
ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టిస్తాం: ఎండీ సజ్జనార్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. ప్రజలు కూడా ఆర్టీసీ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం అబిడ్స్‌లో స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్స్ ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. గత ఏడాది సుమారు రూ 2200 కోట్ల నష్టం సంస్థకు వాటిల్లిందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభాలు వచ్చేలా అనేక రకాల దిద్దుబాటు చర్యలు యాజమాన్యం చేపడుతోందన్నారు. కోవిడ్ లాక్ డౌన్, డీజిల్ రేట్లు పెరగడం కూడా సంస్థ నష్టాలకు కారణమన్నారు. కార్గో, హాస్పిటల్ సేవలను మరింత మెరుగుపరచడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు చూస్తామన్నారు.

అంతేకాకుండా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవడమే కాకుండా సంస్థలో పలు రకాల సంస్కరణలు చేపట్టడం జరుగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. తాజాగా మ్యాంగ్ ఎక్స్ ప్రెస్ ప్రవేశ పెట్టడం తో ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు. కొత్త బస్సుల కోసం టెండర్లు పిలిచామన్నారు. కార్గో సర్వీసుల ద్వారా సుమారు రూ 100 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. సమ్మక్క, సారక్క జాతరలకు కూడా బంగారం రవాణా చేసేందుకు బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

భద్రాచలంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను సుమారు లక్ష మంది భక్తులకు ఇంటింటికి చేర్చడం వంటి అనేక రకాల సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు మరింత దగ్గర కావడానికి హోం డెలివరీ సర్వీసులు ప్రారంభించామని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీలో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి సంస్థను నష్టాల నుండి గట్టెక్కిస్తామని ఆయన అన్నారు.

Next Story