పీఎఫ్‌ఐ‌పై నిషేధంతో ఉగ్రవాదం వెన్ను విరిగింది: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

by Dishafeatures2 |
పీఎఫ్‌ఐ‌పై నిషేధంతో ఉగ్రవాదం వెన్ను విరిగింది: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎఫ్‌ఐ‌పై నిషేధం ద్వారా కేంద్రం ఉగ్రవాదం వెన్ను విరిచిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. సరైన సమయంలో తీసుకున్న సరైన చర్య అని ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్‌ ప్రశంసించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఉగ్రవాదంపై ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. గాజుల రామారంలోని బాలాజీ లే ఔట్ శ్రీ సత్యగౌరి కన్వెన్షన్‌లో వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మేధావులు, స్థానికుల సమక్షంలో జరిగిన విజయదశమి కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు.

సర్వమానవాళి క్షేమాన్ని కాంక్షించే హిందూ ధర్మాన్ని రక్షించుకునేందుకు సమాజం నడుం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌కు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, ఈ దేశంలో జీవించిన మహనీయుల గురించి భవిష్యత్ తరాలకు చెప్పాలని సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటున్నామన్నారు. నవరాత్రుల వేళ అధర్మంపై పోరాడే శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని జగన్మాతను ప్రార్ధించాలన్నారు.

భారత్ అంటేనే ఆధ్యాత్మికత అని, ఆధ్యాత్మికత నశిస్తే దేశం నశించినట్లేనని శ్రీ అరబిందో అన్నారని ఎక్కా చంద్రశేఖర్ గుర్తు చేశారు. వేల సంవత్సరాల భారత ఆధ్యాత్మికతకు రామకృష్ణ పరమహంస ప్రతీక అని ఆయన చెప్పారు. మత మార్పిడి పేరుతో హిందూ సమాజాన్ని చీల్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని, జాగరూక స్థితి అత్యసరమని చెప్పారు. డాక్టర్ హెడ్గేవార్ 97 సంవత్సరాల క్రితం సరిగ్గా విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ప్రారంభించారని, త్యాగమయ జీవితంతో పటిష్టమైన హిందూ సమాజాన్ని నిర్మించేందుకు బాటలు వేశారని ఎక్కా చంద్రశేఖర్ చెప్పారు.

ఆ తర్వాత సర్‌సంఘ్‌చాలక్‌గా వచ్చిన గురూజీ స్వయంగా శంకర పీఠాధిపతి కావాల్సి ఉన్నా సంఘ్ బాధ్యతలు స్వీకరించి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేశారని గుర్తు చేశారు. హిందూ సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆర్ఎస్ఎస్ పోరాడుతోందన్నారు. అంతేకాదు హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తోందని చెప్పారు. కోవిడ్ వేళ భారత్ 70కి పైగా దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు అందించిందని ఎక్కా చంద్రశేఖర్ చెప్పారు.

ప్రపంచం మొత్తాన్ని వసుదైవ కుటుంబకం అని భావిస్తూ భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆర్థిక రంగం, టెక్నాలజీ రంగాల్లోనూ భారత్ దూసుకుపోతోందని చెప్పారు. ప్రకృతిని పూజించడం భారత్‌లో అనాదిగా ఉందని, పర్యావరణ పరిరక్షణలోనూ భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హిందూ సమాజం శక్తిమంతం కావాలని, అస్పృశ్యత తగదని సూచించారు. అంతకు ముందు ఆర్ఎస్ఎస్ నేత, ఆయుర్వేదిక్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడారు.

మనిషిలో అంతర్గతంగా ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం వంటి అవలక్షణాలపై పోరాడి గెలవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత మాట్లాడిన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కొమ్ముల మహేందర్ రెడ్డి ఇంతకాలం చరిత్రను వక్రీకరించి రాశారని, తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చరిత్రను సరిచేసి వాస్తవ చరిత్రను అందజేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి ముందు వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు షాపూర్ నగర్ వీధుల్లో పద సంచలనం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ సహా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పద సంచలనంలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed