రూ.52 కోట్ల భారీ మోసం.. 9 మందికి జీవిత ఖైదు

by Satheesh |
రూ.52 కోట్ల భారీ మోసం.. 9 మందికి జీవిత ఖైదు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: డిపాజిటర్లు దాచుకున్న మొత్తాన్ని సొంతానికి వాడుకున్న టెలిగ్రాఫ్ ట్రాఫిక్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన 9 మందికి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదు విధించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో డిపాజిటర్ల రక్షణ, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1999 అమలులోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నిందితుడికి జీవిత ఖైదు విధించనట్లైంది. ఈ మేరకు జాయింట్ కమిషనర్ సీసీఎస్ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. 2008 సంవత్సరంలో కోఠిలోని టెలిగ్రాఫ్ ట్రాఫిక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు తమ సేవింగ్స్ మొత్తాన్ని సొసైటీ పాలకవర్గం సొంతానికి వాడుకుని తమకు తిరిగి చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు.

సొసైటీలో ఉన్న రూ.52,45,85,868 విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సొంత ఆస్తులు కొనుగోలు చేశారు. దీంతో డిపాజిట్ దారులకు నెల నెల వడ్డీ చెల్లించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా డిపాజిట్లను తిరిగి చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు, సెక్రటరీ ఆకుల కృష్ణమూర్తి (ఏ-1) ఇతర ఎనిమిది మంది సొసైటీ సభ్యులపై డిపాజిటర్లు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీఎస్ సీఐ శరత్ కుమార్ సెషన్స్ జడ్జీ ముందు పూర్తి సాక్షాధారాలను ఉంచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులు అందరికీ డిపాజిటర్ల రక్షణ, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1999 ప్రకారం జీవిత ఖైదుతో పాటు రూ.1.10 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించడంతో పాటు వారి ఆస్థులను అటాచ్ చేశారు.

Next Story

Most Viewed