బాల కార్మికులను కాపాడిన ఆర్​పీఎఫ్​ పోలీసులు

by Disha Web Desk 15 |
బాల కార్మికులను కాపాడిన ఆర్​పీఎఫ్​ పోలీసులు
X

దిశ, మెట్టుగూడ : బాలకార్మికులను అక్రమంగా ఉత్తరప్రదేశ్ నుండి నగరానికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం హైదరాబాద్ రైల్వేస్టేషన్ లో అరెస్ట్ చేసి 8 మంది బాలలను రక్షించి ప్రభుత్వ శిశుసంక్షేమ కేంద్రానికి తరలించినట్లు సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మిత సీ బెనర్జీ తెలిపారు. బచ్పన్ బచావో అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగిందని, ఆర్పీఎఫ్, సైబర్ సెల్ నిరంతర పర్యవేక్షణ కారణంగా వీరిని గుర్తించామని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన ఏహెచ్ టీయూ సభ్యులు నిరంతరం నిఘాను ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణా నిందితులను కోచ్, సీట్ నెంబర్ తో సహా కచ్చితంగా గుర్తించి పట్టుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సభ్యులు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేస్తున్న దాడులలో చాలామంది బాల కార్మికుల రవాణాను అరికట్టగలుగుతున్నామని అన్నారు. ఈ చర్యలో రైల్వేస్టేషన్లలోని ఇతర వ్యక్తులు సీసీ కెమెరాల, అదే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడం వలన సత్పలితాలు వస్తున్నాయని వివరించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన (యాక్షన్ ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్) (ఏఏహెచ్ టీ) లో భాగంగా గత సంవత్సరం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి 23మంది పిల్లలను రక్షించగా ఈ సంవత్సరం 69 మంది మానవ అక్రమ రవాణా దారులను అరెస్ట్ చేసి 151 పిల్లలు బాలకార్మికులుగా మారకుండా కాపాడినట్లు వెల్లడించారు.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) జూన్ 1నుండి 30 వరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని, వారితో కలిసి ఆర్పీఎఫ్ కూడా రైల్వే స్టేషన్ లలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి మహిళలు, బాలల అక్రమ రవాణాను అరికట్టడంలో పాల్గొంటారని తెలిపారు. ఈ రోజు 8 మంది బాలలను కాపాడడంలో హైద్రారాబాద్ ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ జీఆర్పీ, వెంకటేశ్వర్లు, బీబీఏ తదితరులు పాల్గొన్నారని తదుపరి విచారణకు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు.


Next Story

Most Viewed