- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిమ్స్‌లో విదేశీ బాలుడికి అరుదైన శస్త్రచికిత్స..

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఎముకలో కేన్సర్ కారణంగా కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఓ విదేశీ బాలుడికి కిమ్స్ కొండాపూర్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. కెన్యాకు చెందిన ఫేవర్ ఎలీషా (15) బాలునికి నాలుగు నెలల క్రితం కుడి తొడలో చిన్న వాపు కనిపించింది. అది క్రమంగా పెరుగుతూ, చివరకు నడిచేందుకు మోకాలు పూర్తిగా సహకరించకపోగా కాలు కదల్చలేని పరిస్థితికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులకు చూపిస్తే, ఎక్స్ రే తీసి కుడి తొడ ఎముకలో కణితి ఉందని గుర్తించారు. 10 నుండి రూ 25 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత మొత్తం చెల్లించలేక చివరి ప్రయత్నంగా భారత్‌కు వచ్చి కిమ్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు.
కొండాపూర్ కిమ్స్‌లో ముందుగా వైద్యులు ఎలీషా కు వైద్య పరీక్షలు చేసి కుడి తొడ ఎముకలో కేన్సర్ కణితి ఉందని గుర్తించారు. పెద్ద వయసులో ఇలాంటి కణితులు వస్తే కాలు తొలగిస్తారు. చిన్న వయసులో కాలు తీసేస్తే దీర్ఘకాలంలో శారీరక వైకల్యంతో పాటు మానసికంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉండటంతో అధునాతన పద్ధతిని అనుసరించి ఎలీషా కాలు తీసేయాల్సిన అవసరం లేకుండానే విభిన్నమైన చికిత్స చేసి క్యాన్సర్ నుండి విముక్తి కల్పించారు. ముందుగా రేడియేషన్, కీమోథెరపీ చేసి తర్వాత లింబ్ సాల్వేజ్ సర్జరీ ద్వారా అతను పూర్తిగా కోలుకున్నాడు. అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సలో ఆస్పత్రికి చెందిన చీఫ్ ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ సాయి లక్ష్మణ్ అన్నే , కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ సురేష్ బాబు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నరేందర్ కుమార్ తోట ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.