గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ మళ్ళీ మాట తప్పితే.. ఈ సారి జరిగేది అదే..?

by Disha Web Desk 13 |
గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ మళ్ళీ మాట తప్పితే.. ఈ సారి జరిగేది అదే..?
X

దిశ, ముషీరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పై కేసీఆర్ మళ్ళీ మాట తప్పితే ఆమరణ నిరాహారీక్షకు కూర్చుంటాన‌ని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. రాజ్ కుమార్ జాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం సుంద‌ర‌య్య విజ్ఞాన‌ కేంద్రం అయిలమ్మ ఆర్ట్ గ్యాలరీలో గిరిజన లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ సాధ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. రాజ్ కుమార్ జాదవ్ హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ అమాయక గిరిజనులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా రాష్ట్ర స్థాయిలో గిరిజన రిజర్వేషన్ల జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే 1986 లో జూలై 15 న రాజ్యం బద్ధంగా ఆర్టికల్ 16(4) లోబడి ఒక్క జీవో 167 ద్వారా ఏ విధంగా అయితే గిరిజనులకు 4 నుండి 6 శాతం అమలు చేశారో అదే విధంగా తెలంగాణలో అమలు చేయాలన్నారు.

ఛత్తీస్ గఢ్ తరహాలో గిరిజన రిజర్వేషన్ పెంపు రాష్ట్ర స్థాయిలో ఒక్క జీవో ద్వారా అమలు చేయాలన్నారు. 7 శాతం ఉన్న అగ్ర కులాలకు ఈడ‌బ్ల్యు పేరుతో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు గిరిజనుల రాజ్యాంగబద్ధమైన జనాభా దామాషా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఎందుకు ఇన్ని కుట్రలు, నాటకాలు ఆడుతున్నాయని విమ‌ర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగ సమన్వయ కర్త సోమ నాయక్, రాష్ట్ర సమన్వయ కర్త వీర స్వామి నాయక్, బాసర జోన్ సమన్వయ కర్త రవీందర్ నాయక్ ఖాట్రోత్, గోర్ రాష్ట్ర మీడియా ప్రతినిధి రామ్ నాయక్ మాలోత్, గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు బహుజన వాది సాయన్న, ఉప సర్పంచ్ అంగోత్ నవీన్ నాయక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed