Weather Alert: ప్రజలకు అలర్ట్.. మరో రెండు రోజుల పాటు వర్షాలే

by Sathputhe Rajesh |   ( Updated:2022-05-04 07:05:37.0  )
Weather Alert: ప్రజలకు అలర్ట్.. మరో రెండు రోజుల పాటు వర్షాలే
X

Weather Alert

దిశ ప్రతినిధి , హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది . బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో మొదలై సుమారు రెండు గంటల పాటు దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది . కుషాయిగూడలో రోడ్లకు అడ్డంగా చెట్టు కూలింది . ఇదే కాకుండా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది . అపార్ట్ మెంట్ సెల్లార్ లలో నీరు చేరడంతో పార్క్ చేసి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. నగర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మొకాలి లోతులో వర్షం నీరు నిలిచిపోయింది. సీతాఫల్ మండిలో అత్యధికంగా 7.2 సెంమీ వర్షాపాతం నమోదైంది. సరూర్ నగర్ , దిల్సుఖ్ నగర్, కొత్త పేట, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్ పేట్, విద్యానగర్, కోఠి, అబిడ్స్, మలక్ పేట్, చాదర్ ఘాట్, సంతోష్ నగర్ , పాతబస్తీ , నాంపల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్ , గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, మెహదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్ , ఫిలింనగర్ ఇలా అన్ని చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. అయితే వర్షం కురిసేంత వరకు ఎండ వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులకు గురికాగా వాతావరణం చల్లబడడం కొంత ఉపశమనం కల్గించింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం

గంటల పాటు హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. రాంనగర్ , విద్యానగర్ ప్రాంతాలలో బస్తీలను వరద నీరు ముంచెత్తింది. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. రాంనగర్ లో మూసి ఉన్న దుకాణాలు సగానికి పైగా నీట మునిగాయి. చాదర్ ఘాట్, చైతన్యపురి , నాగోల్ , బేగంబజార్, బషీర్ బాగ్ , పాతబస్తీ , కోఠి మెడికల్ కాలేజ్ సమీపంలో, రంగ మహల్ చౌరస్తా , ఎంజే మార్కెట్ , నల్లగొండ చౌరస్తా తదితర ప్రాంతాలలో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు కురుసిన వర్షానికి హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలలో రోడ్లు నీటి కాలువలను తలపించాయి. కాలనీలు, బస్తీలలో వరద నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. చాలా చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచి పోయి ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జాం ఉద్యోగాలకు, వ్యాపార, ఇతరత్రా పనులకు వెళ్లేవారు ఇబ్బందుల పాలయ్యారు .


నమోదైన వర్ష పాతం వివరాలు...(సెం.మీలలో)

సీతాఫల్ మండి 7.2 , ముషీరాబాద్ , మారెడు పల్లి లలో 7 , బంసీలాల్ పేట్ 6.7 , ఎల్ బీ నగర్ 6.4 , వెస్ట్ మారేడు పల్లి 6.1 , అల్వాల్ 5.9 , ఎల్బీ నగర్ 5.8 , గోషామహల్ 5.4 , ఏఎస్ రావు నగర్ 5.1 , బేగంపేట పాటిగడ్డ 4.9 , మల్కాస్ గిరి 4.7 , సరూర్ నగర్ , ఫలక్ నుమా 4.6 , గన్ ఫౌండ్రి 4.4 , చార్మినార్ 4.2 , నాచారం, గుడి మల్కాపూర్ 4.1 , అంబర్ పేట్ 4 , అమీర్ పేట్ , సంతోష్ నగర్ 3.7 , ఖైరతాబాద్ 3.6 , బేగంబజార్, హయత్ నగర్ , చిలుకానగర్ లలో 3.5 వర్షాపాతం నమోదైంది.


మరో రెండు రోజులు వర్షాలు

అల్పపీడన ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్ లో ఈ రోజు మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించారు.


ఈ పండు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని తెలుసా?

Next Story