నగరంలో మారోమారు కుండపోత వర్షం... చెరువులను తలపించిన రోడ్లు

by S Gopi |   ( Updated:2022-09-27 12:49:03.0  )
నగరంలో మారోమారు కుండపోత వర్షం... చెరువులను తలపించిన రోడ్లు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గంటపాటు హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్థంబించిపోయింది. మంగళవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో నల్లటి మేఘాలు, ఉరుములు, మెరుపులతో మొదలైన భారీ వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపించాయి. చాలా చోట్ల రోడ్లపై మొకాలి లోతులో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి పోయింది. లక్డీకాపూల్ నుండి నాంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, మాదాపూర్, ఖైరతాబాద్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, అంబర్ పేట్, ముషారాంబాగ్, ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, కొత్త పేట, చైతన్యపురి, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, చార్మినార్, ఫీర్జాదిగూడ, బషీర్ బాగ్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద మొకాలు లోతులో నీరు నిలిచిపోవడంతో కార్లు సగానికి మునిగిపోయాయి. లక్డీకాపూల్ లో లోతట్టు ప్రాంతాలలో ఇండ్లు, దుకాణాలలోకి నీరు చేరింది. రోడ్లపై వర్షం నీటి ఉధృతి తీవ్రంగా ఉండడంతో ఈ దారిలో ద్వి చక్ర వాహనాలను నిలిపివేశారు. ఎల్బీ నగర్ లోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నాంపల్లి నుండి ఎంజే మార్కెట్ వరకు కేవలం అరకిలోమీటర్ దూరానికి సుమారు గంట సమయం ప్రయాణం చేయవలసిన దుస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వరద నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

అదే జోరు....

సోమవారం సాయంత్రం సమయంలో కురిసిన వర్షం ఇబ్బందుల నుండి ప్రజలు తేరుకోకముందే మరోమారు కురిసిన వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు చేరిపోయింది. దీంతో పనుల నిమిత్తం బయటకు వచ్చినవారు, కార్యాలయాలలో విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్లేవారు వరద నీటితో పడరాని పాట్లు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరచి ఉన్నాయో తెలియక వరద నీటిలో వెళ్లేవారు భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా పాదచారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావద్దని సూచించారు. అల్కపురి 4.4 సెంమీ , సౌత్ హస్తినాపురంలో 4.7 సెంమీ వర్షం నమోదైంది. భారీ వర్షం కారణంగా షరా మామూలే అన్నట్లుగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Next Story