'టీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఒరగబెట్టిందేమిటి? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి'

by S Gopi |
టీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఒరగబెట్టిందేమిటి? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎనిమిదిన్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఒరగబెట్టిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లి గన్ పార్కు లోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం 1200 మందికి పైగా బీసీలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యమివ్వకపోగా, తీవ్రంగా అణచివేస్తుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదన్నరేళ్లయినా బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు కనుమరుగయ్యాయని, రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్ కు ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

బీసీ రుణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా యువత దాదాపు 5.45 లక్షల మంది ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, రుణాలు నేటికి మంజూరు చేయకపోవటంతో స్వయం ఉపాధి లేక యువత ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో సైతం బీసీ రిజర్వేషన్లు సగానికి పైగా తగ్గించి రాజకీయంగాను అణచివేశారన్నారు. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి హామీల పేరుతో మోసం చేసే కుట్ర చేస్తుందని బీసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాలని యుగందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు సత్తార్, గంగపురం పద్మ, అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్, విజయభాస్కర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed