మహిళా మంత్రుల హామీలు, శపథాలు హాస్యాస్పదం.. బీజేపీ ఓబీసీ మోర్చా మల్లేశ్వరపు రాజేశ్వరి

by srinivas |   ( Updated:2022-10-15 13:09:01.0  )
మహిళా మంత్రుల హామీలు, శపథాలు హాస్యాస్పదం.. బీజేపీ ఓబీసీ మోర్చా మల్లేశ్వరపు రాజేశ్వరి
X

దిశ, అంబర్ పేట్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ఇస్తున్న హామీలు చేస్తున్న శపథాలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా ఎంబీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మునుగోడులో ఓటర్లను ఉద్దేశించి గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఓటర్లను మభ్యపెడుతున్నారని తాను నిర్వహిస్తున్న విద్యాశాఖ లో పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇంతవరకు పంపిణీ చేయకుండా.. మన ఊరు మన బడి అంటూ ఆర్భాటాలు చేసి ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు సమకూర్చలేని దీనావస్థలో ఉందని ఆరోపించారు.

మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం నీళ్ల చారు తిని వేలాదిమంది అస్వస్థతకు గురైతే పట్టించుకోని మంత్రి మునుగోడు అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సత్యవతి రాథోడ్ నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖకు న్యాయం చేయకుండా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు తొడగనని శపథం చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజనులకు న్యాయం చేయడం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు తండాలను పంచాయతీలుగా మార్చేదాక వందల ఏళ్ల నుండి గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చేదాకా చెప్పులు వేసుకోనని శపథం చేస్తే బాగుండేదని అన్నారు. ఒకపక్క కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి టీఆర్ఎస్ ను సైతం బి ఆర్ఎస్ గా మార్చి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు అంటుంటే సత్యవతి రాథోడ్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులు వేసుకోనని అనడంలో ఆంతర్యం ఏమిటని ఎద్దేవా చేశారు. సమావేశంలో అంజలి సుజాత రజిని దేవి పాల్గొన్నారు.

Next Story