మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం

by Sumithra |
మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం
X

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్‌ తాజ్ బంజారా హోటల్లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 – 2025 కార్యక్రమాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం), ఏప్రిల్ 14 (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి) తేదీలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళల హక్కుల కోసం పార్లమెంట్‌లో అనేక బిల్లులు రూపొందించబడ్డాయని, ఈ దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి రూ. 21,000 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందుతుండటం విశేషమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని, 1000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా శక్తి క్యాంటీన్స్, ఆర్టీసీతో కలిసి మహిళలు భాగస్వామ్యం అవడం, స్థానిక సంస్థలలో 33 శాతం రిజర్వేషన్లు వంటి పలు చర్యల ద్వారా మహిళలు తమ పాదాల పై నిలబడేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన “మా సీఎం మాటను తెలియజేస్తున్నానని.. తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది” అని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ సివి ఆనంద మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యం ఆధారంగా ప్రజల కోసం పనిచేసే వేదిక (హెచ్సిఎస్సి) అని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకుంటున్నామని.. కంపెనీల యజమానులు, సీఈఓలు (హెచ్సిఎస్సి) లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాట్లు తెలిపారు. అలాగే.. మహిళల భద్రత కోసం సిటీ పోలీస్ (హెచ్సిఎస్సి) కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని.. గర్ల్ చైల్డ్ రేషియో ప్రస్తుతం 942గా ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్నా, అక్కడ షీ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. గత ఏడాది మహిళల పై, చిన్నారుల పై నేరాలకు పాల్పడిన అనేక మంది నిందితులను జైలుకు పంపించామని తెలిపారు. హైదరాబాద్ పోలీసు పరిధిలో ఏడు ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాత్రి వేళల్లో కూడా ఉమెన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. మహిళలు భయపడకుండా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed